Connect with us

Telangana

దుందుభి నదిలో చిక్కిన అరుదైన చేపలు.. ఆ మత్స్యకారుడి పంట పండినట్టే..!

నాగర్ కర్నూల్ జిల్లాలో ఒక మత్స్యకారుడి వలకు అరుదైన చేపలు చిక్కాయి. కృష్ణా ఉపనది అయిన దుందుభి నదిలో చేపల వేటకు వెళ్లిన జాలరి ఒకరు రెండు అరుదైన చేపలను పట్టుకున్నాడు. ఉప్పునుంతల మండలం కంసానిపల్లి సమీపంలోని దుందుభి నదిలో చీమర్ల మణిందర్ అనే జాలరి చేపల వేటకు వెళ్ళగా, అతడి వలకు రెండు అరుదైన చేపలు చిక్కాయి. వాటిలో ఒకటి పాము ఆకారంలో ఉండగా, మరొకటి శరీరంపై మచ్చలతో కనిపించింది. పాము ఆకారంలో ఉన్నది మలగమేను చేప కాగా, మరొకటి చెన్నై మెరీనా బీచ్‌లో కనిపించే డెవిల్ ఫిష్ అని గుర్తించారు.

మలగమేను చేప చాలా అరుదుగా లభిస్తుందని తోటి జాలరులు చెప్పారు. దీని విలువ చాలా ఎక్కువ అని, ఔషధాలు తయారీలో దీన్ని ఉపయోగిస్తారని పేర్కొన్నారు. మలగమేను చేప 2.25 కేజీల బరువుతో లభించినట్లు వెల్లడించారు. గత నాలుగేళ్ల క్రితం కూడా ఈ ప్రాంతంలో మలగమేను చేపలు పట్టుకున్నట్లు మత్స్యకారులు చెప్పారు. ఈ చేపలు చాలా అరుదుగా వలలకు చిక్కుతాయని, విలువతో పాటు ఈ మత్స్యకారుడి పంట పండిందని చర్చించుకుంటున్నారు. రెండు అరుదైన చేపలు ఒకేసారి పట్టుకోవడంతో స్థానికులు అవి చూడడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు.

మత్స్యశాఖ అధికారులు డెవిల్ ఫిష్ చాలా ప్రమాదకరమైనది అని చెబుతున్నారు. ఇది నదులు మరియు సముద్రాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. 2016లో కృష్ణానదిలో విజయవాడ వద్ద తొలిసారిగా ఈ డెవిల్ ఫిష్ కనిపించింది. భూమిపై కూడా తిరగగల ఈ డెవిల్ ఫిష్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోని 65% నీటివనరులకు విస్తరించిందని మత్స్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ చేపలు చెరువుల్లోని మేతతో పాటు చేపలను కూడా తినేస్తాయి. సున్నితమైన జల జీవావరణ వ్యవస్థను కూడా ఈ చేపలు హానిచేస్తాయని తెలిపారు.

 

Loading