Latest Updates
కేంద్రం గ్రీన్ సిగ్నల్.. తెలంగాణకు 16 మంది కొత్త IAS అధికారులు
తెలంగాణ రాష్ట్ర సర్వీస్ అధికారులు చాలా సంవత్సరాలుగా పదోన్నతుల కోసం వేచిచూస్తున్నారు. ఇప్పుడు వారి వేచిచూపు అంతమైంది. 16 మంది గ్రూప్-2 అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్ హోదా ఇచ్చింది.
2022, 2023, 2024 సంవత్సరాలకు సంబంధించిన ఖాళీలను కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ భర్తీ చేసింది. ఈ నియామకాలకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. అందుకే వారిని తెలంగాణ క్యాడర్‌కు కేటాయించారు.
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇలా ఒకేసారి ఇంతమంది గ్రూప్-2 అధికారులు ఐఏఎస్ అవుతున్నారు. కేంద్రం విడుదల చేసిన గెజిట్ ప్రకారం, 2022 కోటాలో 11 మంది, 2023 కోటాలో 3 మంది, 2024 కోటాలో 2 మంది అధికారులను ఐఏఎస్ హోదాకు ఎంపిక చేశారు. అయితే, ఈ నియామకాలు తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్ తుది తీర్పుకు లోబడి ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది.
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతోనే ఈ పదోన్నతులు సాధ్యమయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం సాయంత్రం జేఏసీ నేతలతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలిసిన లచ్చిరెడ్డి.. ప్రభుత్వం అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
డిప్యూటీ తహశీల్దార్లుగా సేవా ప్రస్థానాన్ని ప్రారంభించి.. నేడు దేశంలోనే అత్యున్నతమైన ఐఏఎస్ హోదా దక్కించుకోవడం ప్రతి గ్రూప్-2 అధికారికి గర్వకారణమని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. ఈ పదోన్నతుల వల్ల పరిపాలనా వ్యవస్థలో ఖాళీలు భర్తీ కావడంతో పాటు.. క్షేత్రస్థాయి అనుభవం ఉన్న అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఏర్పడనుంది. పదోన్నతి పొందిన అధికారులకు సహచరులు, మిత్రులు, శ్రేయోభిలాషుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
#Telangana#IASPromotions#Group2Officers#TSPSC#CivilServices#TelanganaAdministration#IASCadre#GovernmentJobs
#EmployeePromotions#RevanthReddy#TSNews#Bureaucracy
![]()
