Andhra Pradesh
వాహనదారులకు టీటీడీ హెచ్చరిక.. అధిక వేగం దాటితే ఫైన్ తప్పదు
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి కీలక సూచనలు జారీ చేసింది. ఘాట్ రోడ్డులో వాహనాల ప్రయాణానికి సంబంధించి అమల్లో ఉన్న నిబంధనలు, సమయాలపై భక్తులకు స్పష్టతనిచ్చింది. ప్రమాదాల నివారణతో పాటు అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యంగా ఈ నియమాలను కఠినంగా అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
టీటీడీ నియమాల ప్రకారం, నాలుగు చక్రాల వాహనాలు ఉదయం 3 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే ఘాట్ రోడ్డులో ప్రయాణించవచ్చు. అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు రోడ్డు మూసివేయబడుతుంది.
ద్విచక్ర వాహనాలు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ప్రయాణించవచ్చు. రాత్రి సమయంలో జంతువులు అడవుల్లో ఎక్కువగా సంచరించడం వల్ల బైక్‌లు ప్రయాణించడానికి అనుమతి లేదు.
ఘాట్ రోడ్డులో వేగ నియంత్రణ కోసం ‘టైమ్ లాక్’ విధానాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. టోల్ గేట్ వద్ద వాహనం ప్రవేశించిన సమయాన్ని నమోదు చేసి, నిర్ణీత సమయానికి ముందుగా గమ్యస్థానానికి చేరుకుంటే జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. తిరుపతి నుంచి తిరుమలకు చేరుకోవడానికి కనీసం 28 నిమిషాలు, తిరుమల నుంచి తిరుపతికి దిగివచ్చేందుకు కనీసం 40 నిమిషాలు సమయం పడుతుందని పేర్కొన్నారు.
భక్తులు అధిక వేగం ప్రదర్శించకుండా, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, ఘాట్ రోడ్డులో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణించాలని టీటీడీ సూచించింది. ఈ నిబంధనలను కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలను నివారించడమే కాకుండా, భక్తులు సురక్షితంగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. భక్తుల భద్రతతో పాటు అటవీ ప్రాంతంలోని వన్యప్రాణుల రక్షణ కోసమే ఈ చర్యలు కొనసాగుతున్నాయని, తాజాగా మరోసారి భక్తులను అలర్ట్ చేసినట్లు వెల్లడించారు.
#Tirumala#TTDAlert#TirumalaGhatRoad#SrivariDarshan#Tirupati#DevoteeSafety#GhatRoadRules#TimeLockSystem
#TTDGuidelines#PilgrimAlert#WildlifeProtection#SafeJourney#TirumalaUpdates
![]()
