Andhra Pradesh
అన్నవరం ఆలయంలో కీలక పరిణామం.. ఆరుగురు వ్రత పురోహితులపై వేటు
భక్తుల విశ్వాసాన్ని కాపాడే దిశగా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఉచితంగా నిర్వహించాల్సిన సామూహిక వ్రతాల సందర్భంగా భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటనలో ఆరుగురు వ్రత పురోహితులను విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ ఆలయ అధికారులు సంచలన నిర్ణయం
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈ నెల 21న అన్నవరం ఆలయం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక సత్యదేవుని వ్రతాలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 300 జంటలు పాల్గొనగా, వెయ్యి మందికి పైగా భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆరుగురు రెగ్యులర్ వ్రత పురోహితులు, ముగ్గురు అదనపు పురోహితులు, వ్రత సామగ్రితో పాటు ప్రచార రథంతో వెళ్లారు.
అయితే వ్రత కథ ముగిసిన అనంతరం పురోహితులు మైక్ ద్వారా భక్తులను ఉద్దేశించి వస్త్ర దానం పేరిట రూ.501, అన్నదానం కింద రూ.251 ఇవ్వాలని డిమాండ్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు దేవదాయశాఖ ఉన్నతాధికారులకు చేరడంతో వ్యవహారం తీవ్రతరం అయింది.
ఈ ఫిర్యాదులపై దేవదాయశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ హరి జవహర్లాల్, కమిషనర్ కే.రామచంద్రమోహన్ ఆదేశాల మేరకు అన్నవరం ఆలయ ఈవో త్రినాథరావు విచారణ చేపట్టారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో అన్నవరం సింహాచలం దేవస్థానంలో ఏర్పాటు చేస్తున్న సామూహిక అన్నదాన కార్యక్రమానికి స్పెషల్ గ్రేడ్ పురోహితులు ప్రయాగ ఆంజనేయులు, తొయ్యేటి వెంకట నరసింహ హరినాథ సుబ్రహ్మణ్యం, మంథా శ్రీరామ్మూర్తి, సెకండ్ గ్రేడ్ పురోహితులు పాలంకి సోమేశ్వరరావు, మల్లాది గురుమూర్తి, థర్డ్ గ్రేడ్ పురోహితుడు మెకరాల సతీష్లను విధుల నుంచి సస్పెండ్ చేశారు.
అలాగే ఈ ఘటనలో పాత్ర ఉన్న వ్రత గుమాస్తా బి.రాజుకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో త్రినాథరావు స్పష్టం చేశారు. భక్తుల విశ్వాసమే ఆలయానికి మూలస్తంభమని, పారదర్శక పాలనకు దేవస్థానం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
గమనార్హంగా సస్పెండ్ అయిన పురోహితుల్లో కొందరిపై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఉండటం విషయం చర్చనీయాంశంగా మారింది. ఒకేసారి ఆరుగురు వ్రత పురోహితులపై వేటు పడటం అన్నవరం ఆలయ చరిత్రలో అరుదైన ఘట్టంగా భావిస్తున్నారు.
#AnnavaramTemple#AnnavaramNews#VratapuroluSuspension#DevoteeTrust#TempleTransparency#SatyanarayanaVratham
#APTempleNews#DevasthanamAction#PilgrimsRights#AnnavaramUpdates
![]()
