Connect with us

International

30 ఏళ్ల అమెరికా జీవితం తర్వాత షాక్.. గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూలో భారతీయ మహిళ అరెస్ట్

మూడు దశాబ్దాలకు పైగా అమెరికాలో జీవితం గడుపుతున్న ఓ భారతీయ కుటుంబానికి అనూహ్య షాక్ తగిలింది.

మూడు దశాబ్దాలకు పైగా అమెరికాలో జీవితం గడుపుతున్న ఓ భారతీయ కుటుంబానికి అనూహ్య షాక్ తగిలింది. శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ చివరి దశకు చేరిన వేళ, ఇమ్మిగ్రేషన్ అధికారులు కుటుంబానికి చెందిన మహిళను అదుపులోకి తీసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. పంజాబ్‌కు చెందిన ఈ మహిళను ఇంటర్వ్యూ నెపంతో పిలిపించి అకస్మాత్తుగా అరెస్ట్ చేయడం కుటుంబసభ్యులను ఆందోళనకు గురి చేస్తోంది.

పంజాబ్‌కు చెందిన బబ్లెజిత్ ‘బబ్లీ’ కౌర్ (60) 1994 నుంచి అమెరికాలో నివసిస్తున్నారు. లాంగ్ బీచ్‌లో కుటుంబంతో కలిసి ఉంటూ వ్యాపార, ఉద్యోగ రంగాల్లో స్థిరపడ్డ ఆమె, గ్రీన్ కార్డు దరఖాస్తుకు సంబంధించి బయోమెట్రిక్ స్కాన్ అపాయింట్‌మెంట్ కోసం ఇటీవల ఇమ్మిగ్రేషన్ కార్యాలయానికి వెళ్లారు. అయితే అక్కడే ఫెడరల్ ఏజెంట్లు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయాన్ని ఆమె కుమార్తె జోటి వెల్లడించారు. డిసెంబర్ 1న తల్లి ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) కార్యాలయ ఫ్రంట్ డెస్క్ వద్ద ఉండగా, కొంతమంది అధికారులు వచ్చి ఒక గదిలోకి పిలిచి అరెస్ట్ చేశారని చెప్పారు. న్యాయవాదితో ఫోన్‌లో మాట్లాడేందుకు మాత్రమే అనుమతించారని, అనంతరం ఆమెను ఎక్కడికి తీసుకెళ్లారో కొన్ని గంటలపాటు కుటుంబానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వాపోయారు.

తరువాత ఆమెను కాలిఫోర్నియాలోని అడెలాంటోలో ఉన్న ICE డిటెన్షన్ సెంటర్‌కి తరలించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె అక్కడే నిర్బంధంలో ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబం తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

కౌర్ కుటుంబం 1990లలో అమెరికాకు వలస వెళ్లి మొదట లాగునా బీచ్‌లో స్థిరపడింది. అనంతరం బెల్మాంట్ షోర్ ప్రాంతానికి మారింది. కౌర్ దంపతులకు ముగ్గురు పిల్లలు. భారత్‌లో జన్మించిన పెద్ద కుమార్తె జోటి, డీఏసీఏ (DACA) కార్యక్రమం కింద చట్టబద్ధమైన హోదా పొందింది. మిగిలిన ఇద్దరు పిల్లలు అమెరికాలోనే పుట్టడంతో వారికి ఆ దేశ పౌరసత్వం లభించింది. కౌర్ భర్తకు గ్రీన్ కార్డు ఉండగా, ఆమెకు కూడా గ్రీన్ కార్డు పిటిషన్ పెండింగ్‌లో ఉంది.

కౌర్, ఆమె భర్త గత రెండు దశాబ్దాలుగా బెల్మాంట్ షోర్ సెకండ్ స్ట్రీట్‌లో ‘నటరాజ్ క్యుజిన్’ పేరుతో భారతీయ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా, ఆమె సుమారు 25 ఏళ్ల పాటు రైట్ ఎయిడ్ ఫార్మసీలో పనిచేశారు. ఆ సంస్థ ఇటీవల శాఖలను మూసివేయడంతో, మళ్లీ ఓ భారతీయ రెస్టారెంట్‌లో చేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కౌర్‌ను విడుదల చేయాలని లాంగ్ బీచ్ ప్రతినిధి, డెమొక్రాటిక్ కాంగ్రెస్ సభ్యుడు రాబర్ట్ గార్సియా డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ఫెడరల్ అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఆయన కార్యాలయం తెలిపింది. మరోవైపు, బబ్లీ కౌర్‌ను బాండ్‌పై విడుదల చేయించేందుకు కుటుంబ సభ్యులు న్యాయపరమైన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

కుటుంబసభ్యుల మాటల్లో, కౌర్‌ను పెద్ద డార్మిటరీ తరహా గదిలో డజన్ల మంది మహిళలతో కలిసి నిర్బంధించారు. రాత్రంతా లైట్లు వెలిగే ఉండటంతో పాటు, నిరంతర శబ్దాల కారణంగా నిద్ర కూడా రావడం లేదని తెలిపారు. కలిసేందుకు వెళ్లినప్పుడు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోయారు.

‘‘ఇది ఒక భయానక అనుభవం. ఆమె అక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదు. ఆమెను బయటకు తీసుకురావడానికి మేము చేయగలిగిన ప్రతిదీ చేస్తున్నాం. ఇది పూర్తిగా అమానుషంగా ఉంది’’ అని కుమార్తె జోటి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటన అమెరికాలో వలసవాదుల భద్రత, మానవ హక్కులపై మరోసారి చర్చకు తెరలేపింది.

#GreenCardIssue#IndianImmigrant#USImmigration#ICECustody#HumanRights#IndianFamilyInUSA
#ImmigrationNews#AdelantoDetentionCenter#DACA#LongBeach

Loading