Connect with us

Uncategorized

ఆంధ్రలో స్క్రబ్ టైఫస్ ఉధృతి కొనసాగుతూనే… ప్రాణనష్టం సంఖ్య 5కు చేరింది!

స్క్రబ్‌ టైఫస్‌

ఆంధ్రప్రదేశ్‌లో ‘స్క్రబ్ టైఫస్’ వ్యాధి మళ్లీ తెరపైకి వచ్చింది. ఇటీవలి రోజుల్లో వరుస మరణాలు సంభవించడం ప్రజల్లో ఆందోళన పెంచుతోంది. ఈ వ్యాధితో ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య శాఖ నిర్ధారించింది. మృతి చెందినవారు విజయనగరం, పల్నాడు, బాపట్ల, నెల్లూరు జిల్లాలకు చెందినవారని అధికారులు తెలిపారు.

స్క్రబ్ టైఫస్‌కి ఇప్పటివరకు ఎలాంటి టీకా అందుబాటులో లేకపోవడంతో, త్వరితగతిన లక్షణాలు గుర్తించి చికిత్స ప్రారంభించడం మాత్రమే భద్రతనిచ్చే మార్గమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గత కొన్నేళ్లుగా అక్రమంగా కేసులు నమోదవుతున్నా, ప్రస్తుతం వరుస మరణాలు జరగడంతో ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఎలాంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త?

శరీరంపై ఏదైనా పురుగు కుట్టినట్టుగా మచ్చలు రావడం, కాలిన గాయంలాంటి గుర్తులు కనిపించడం, అకస్మాత్తుగా

జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట

లాంటివి కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. స్వయం చికిత్స చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు.

స్క్రబ్ టైఫస్‌ను ర్యాడిప్, వైల్–ఫెలిక్స్, IgM ELISA పరీక్షల ద్వారా ప్రారంభ దశలోనే గుర్తించవచ్చని వైద్యులు పేర్కొన్నారు. వ్యాధి తొందరగా గుర్తిస్తే యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయడం ద్వారా ప్రాణాపాయం పూర్తిగా నివారించవచ్చని చెబుతున్నారు.

ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది?

ఈ వ్యాధి ‘ఒరియెంటియా సుట్సుగముషి’ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది.

ఇది మనుషులకు ఒక సూక్ష్మ కీటకం అయిన ‘చిగ్గర్ మైట్’ కాటు ద్వారా సంక్రమిస్తుంది.

ఒకరి నుండి మరొకరికి ఈ వ్యాధి వ్యాపించదు.

ఆగస్టు నుండి ఫిబ్రవరి వరకు ఈ కీటకాల చలనం ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదం కూడా అధికమవుతుంది.

పొలాల్లో పనిచేసే రైతులు, గడ్డిమైదానాల్లో ఆడే పిల్లలు, శుభ్రత లోపించిన ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలిపారు.

జాగ్రత్తలు ఎలా పాటించాలి?

ఇంటి చుట్టుపక్కల, పశువుల పాకల్లో చెత్త నిల్వ కాకుండా శుభ్రత పాటించడం.

రాత్రివేళల్లో బయట నిద్రించక పోవడం.

ఇంట్లో ఎలుకలు, కీటకాలు ఉండకుండా చర్యలు తీసుకోవడం

పరుపులు, దుప్పట్లు, ఫర్నిచర్‌ను తరచూ శుభ్రపరచడం

ఉదా: పూర్తిగా శరీరాన్ని కప్పే దుస్తులు ధరించడం.

ముఖ్యంగా పిల్లలకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం

మరణించిన వారి వివరాలు

స్క్రబ్ టైఫస్‌ కారణంగా మృతి చెందినవారిలో:

రాజేశ్వరి (40) – విజయనగరం జిల్లా– నవంబర్ 26

జ్యోతి (10) – పల్నాడు జిల్లా – నవంబర్ 1

మస్తాన్‌బీ (43) – బాపట్ల జిల్లా – నవంబర్ 14

నాగమ్మ (64) – పల్నాడు జిల్లా – నవంబర్ 16

సంతోషి (5) – నెల్లూరు జిల్లా – డిసెంబర్ 4

ఈ వరుస మరణాలు ప్రజలను ఆందోళనకు గురిచేయడంతో ఆరోగ్య శాఖ మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

#ScrubTyphus #AndhraPradesh #APHealthAlert #HealthNews #APBreakingNews #InfectionAlert #PublicHealth #TeluguNews #DiseaseAwareness #SafetyTips #HealthUpdate #PrakasamDistrict

Loading