Telangana
ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?

సాధారణంగా కోర్టు కేసులు కుటుంబ కలహాలు, భూ వివాదాలు లేదా హత్య కేసులకు సంబంధించినవే ఉంటాయి. కానీ జగిత్యాల జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. గాజుల పండగకు పిలవలేదని ఒక మహిళ కోర్టును ఆశ్రయించడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. కోరుట్ల మండలం కల్లూరు గ్రామంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఊహించని మలుపు తిరిగింది.
స్నేహితులందరూ కలిసి సంతోషంగా గాజులు వేసుకునే కార్యక్రమాన్ని జరుపుకుంటుండగా, కోంపల్లి అనిత అనే మహిళకు ఆహ్వానం అందలేదు. దీనిపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తనను ఎందుకు పిలవలేదో చెప్పాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆమె వాదన ప్రకారం, తాను మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉన్నప్పటికీ, తనను పట్టించుకోకపోవడం అన్యాయం అని పేర్కొంది.
అనిత పిటిషన్ను కోర్టు పరిగణలోకి తీసుకొని సంఘ సభ్యులకు నోటీసులు జారీ చేయడం ఊహించని పరిణామం అయింది. ఈ నోటీసులు అందుకున్న మహిళలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. సంఘం సభ్యుల ప్రకారం, వారు అనితను కూడా పిలిచారని, ఆమె అప్పుడు రాలేదని చెబుతున్నారు. ఈ చిన్న అపార్థం ఇప్పుడు పెద్ద కోర్టు వివాదంగా మారింది.
గ్రామస్థులు ఈ సంఘటనను నవ్వుతో స్వీకరిస్తున్నా, ఇది మన మధ్య ఉన్న సామాజిక సంబంధాలు, మనస్పర్థలపై ఒక పాఠాన్ని నేర్పుతోంది. చిన్న విషయాన్ని పెద్దదిగా మార్చే మనసు పరిస్థితులే కొన్నిసార్లు మన జీవితంలో ఇలాంటి విచిత్ర ఘటనలకు కారణమవుతాయి. సోషల్ మీడియాలో ఈ ఘటన “గాజుల పండగ కోర్టు కేసు”గా వైరల్ అవుతోంది.