Telangana
మేడారం రోడ్ల అభివృద్ధికి రూ.91 కోట్లు – నాలుగు లైన్లుగా రోడ్ల విస్తరణకు సిద్ధమైన ప్రభుత్వం

మేడారం మహాజాతర కోసం ప్రభుత్వం భారీగా చర్యలు ప్రారంభించింది. వచ్చే సంవత్సరం జరగబోయే మహాజాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రోడ్ల విస్తరణ, వంతెనల నిర్మాణం, లైటింగ్ వంటి పనులు వేగంగా సాగుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.91 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ మొత్తంలో ప్రధానంగా మేడారం రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించడంతో పాటు లోలెవల్ బ్రిడ్జిలను హైలెవల్ వంతెనలుగా మార్చే పనులు జరుగనున్నాయి.
ప్రతీ సంవత్సరం మేడారం జాతరకు కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారు. జంపన్నవాగు నుంచి స్థూపం వరకు సుమారు 3 కిలోమీటర్ల రోడ్డు రెండు వరుసలుగా ఉండటం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణంతో పాటు మధ్యలో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనుంది. వీటితో పాటు భవిష్యత్ అవసరాల కోసం రోడ్డు ఇరువైపులా మురుగు కాలువల నిర్మాణం కూడా జరుగుతుంది.
రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనులకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. ఇల్లందు-పాకాల రోడ్డు విస్తరణకు రూ.12 కోట్లు, తాడ్వాయి-నార్లాపూర్ రోడ్డు మీద హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణానికి రూ.27.5 కోట్లు కేటాయించారు. అన్ని పనులను ఈ సంవత్సరం డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన గడువు ఇచ్చింది.
భవిష్యత్తులో కూడా మేడారం ప్రాంతం పుణ్యక్షేత్రంగా మరింత అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. జాతరకు వచ్చే భక్తుల రాకపోకలు సులభతరం చేయడంతో పాటు రోడ్ల భద్రత, సౌకర్యాలను మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టు కీలకంగా నిలవనుంది.