Devotional
TTD ఈవోగా మరోసారి సింఘాల్.. ఆయన గురించి తెలుసా?
ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారి అనిల్‌కుమార్ సింఘాల్ మరోసారి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో)గా నియమితులయ్యారు. 2017 నుంచి 2020 వరకు ఆయన ఇదే పదవిలో పనిచేశారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అనేక సంస్కరణలు తీసుకువచ్చిన సింఘాల్ మళ్లీ బాధ్యతలు చేపట్టడం విశేషంగా మారింది.
తన గత పదవీకాలంలో టైమ్‌స్లాట్ దర్శనాలు, టోకెన్ విధానాన్ని అమలు చేయడం ద్వారా భక్తుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించారు. అదేవిధంగా, శ్రీవాణి ట్రస్టును రూపొందించి అమలు చేశారు. ఈ ట్రస్ట్ ద్వారా ప్రతి నెలా TTDకు సుమారు రూ.450 కోట్ల ఆదాయం లభిస్తోంది. అంతేకాక, దేవస్థానంలో అన్యమత ఉద్యోగుల గుర్తింపు కోసం ప్రత్యేక సర్వే కూడా చేపట్టారు.
అయితే, 2020లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను ఆరోగ్యశాఖకు బదిలీ చేసింది. ఇప్పుడు మళ్లీ అదే కీలకమైన బాధ్యతల్లోకి వస్తుండటంతో, తిరుమల భక్తులు మరియు అధికారులు ఆయన నుంచి మరిన్ని సరికొత్త మార్పులను ఆశిస్తున్నారు.