Andhra Pradesh
రైతులను చంద్రబాబు గాలికొదిలేశారు: జగన్
పులివెందులలో ఉల్లి, బత్తాయి రైతులతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల సమస్యలను గుర్తుచేశారు. ప్రస్తుతం సరైన ధరలు లేక రైతులు అల్లాడిపోతున్నారని ఆయన ఆరోపించారు. పంటకు న్యాయం జరగక, వ్యవసాయం చేయడానికి రైతులు భయపడే స్థితి ఏర్పడిందని అన్నారు.
జగన్ వ్యాఖ్యల ప్రకారం, చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు పట్టింపు లేకుండా గాలికొదిలేశారని తీవ్ర విమర్శలు చేశారు. యూరియా సరఫరాలో కూడా అవకతవకలు జరుగుతున్నాయని, ప్రభుత్వ పెద్దలే కమీషన్ల కోసం బ్లాక్ మార్కెట్కు ప్రోత్సాహం ఇస్తున్నారని ఆరోపించారు. పెట్టుబడి సాయం పేరుతో రెండు సంవత్సరాలకు రైతులకు రావలసిన రూ.40 వేలు కేవలం రూ.5 వేల రూపాయలుగా “అన్నదాత సుఖీభవ” పథకంలో ఇచ్చారని గుర్తుచేశారు.
“మా హయాంలో క్వింటా రూ.లక్ష వరకు పలికిన చీనీ ధరలు, ఇప్పుడు రూ.12 వేలకూ ఎవరూ కొనడం లేదు. రైతులు దెబ్బతింటున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు” అంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో రైతు బతుకు దయనీయంగా మారిందని, వారికి మద్దతు లేకుండా వ్యవసాయం ముందుకు సాగదని ఆయన హెచ్చరించారు.