Andhra Pradesh
సినీ కార్మికుల సమ్మె పరిష్కార దిశగా
తెలుగు సినిమా పరిశ్రమలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మెకు ఇవాళ శుభం పలికే అవకాశం కనిపిస్తోంది. వేతనాల పెంపు కోసం ఫెడరేషన్ నాయకత్వంలో కార్మికులు పోరాటం ప్రారంభించగా, చిత్రీకరణలు ఆగిపోవడంతో అనేక చిత్రాల నిర్మాణం నిలిచిపోయింది. నిర్మాతలు, కార్మికుల మధ్య చర్చలు అనేక సార్లు జరిగినప్పటికీ ఇప్పటివరకు స్పష్టత రాలేదు. అయితే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నిర్మాతలతో ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు భేటీ కానుండగా, ఇది కీలక మలుపుగా భావిస్తున్నారు.
తరువాత సాయంత్రం 4 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు, ఫెడరేషన్ నాయకులు ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ భేటీలో వేతనాల పెంపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాజీకి వస్తారని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. కార్మికుల సమస్యలు పరిష్కారమైతే వెంటనే షూటింగ్‌లు తిరిగి ప్రారంభమవుతాయని, ఇప్పటికే వాయిదాపడిన షెడ్యూల్లు పునఃప్రారంభం అవుతాయని చిత్ర పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ సమ్మె కారణంగా పలు పెద్ద సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. దీంతో దసరా, దీపావళి సీజన్లలో విడుదల కావాల్సిన సినిమాలపై ప్రభావం పడే పరిస్థితి ఏర్పడింది. టాలీవుడ్ బాక్సాఫీస్‌పై పెద్ద నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందని పరిశ్రమలో చర్చ నడిచింది. అయితే ఇవాళ జరగబోయే చర్చలు సఫలమైతే, సినీ కార్మికుల సమ్మెకు ముగింపు పలికి, పరిశ్రమ మళ్లీ తన పూర్వ వేగాన్ని అందుకుంటుందని ఆశలు పెరుగుతున్నాయి.