Business
గోల్డ్ vs కార్.. ఏది కొంటే మంచిది?
మిడిల్ క్లాస్ కుటుంబాల్లో “కారు కొనాలి? లేక బంగారం కొనాలి?” అనే సందేహం తరచూ ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో ఫైనాన్షియల్ అనలిస్టులు స్పష్టమైన సూచనలు చేస్తున్నారు. కారు ఒక అవసరమైన సౌకర్యం అయినప్పటికీ అది పెట్టుబడిగా పనికి రాదని చెబుతున్నారు. ఎందుకంటే కారు విలువ 10-12 ఏళ్లలో 70-80 శాతం వరకు పడిపోతుందని, అంటే కొనుగోలు చేసిన వెంటనే డిప్రిసియేషన్ ప్రారంభమవుతుందని వారు వివరిస్తున్నారు.
దానికి విరుద్ధంగా బంగారం మాత్రం తరతరాల పాటు నిలిచే సంపద అని నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణం ఎంత పెరిగినా బంగారం విలువ కూడా అదే స్థాయిలో పెరుగుతుందని, దీన్ని “ఇన్ఫ్లేషన్ హెడ్జ్”గా పరిగణిస్తారని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఖరీదైన ఫోన్, విలాసవంతమైన ట్రిప్పులు కొన్ని రోజులు లేదా సంవత్సరాల పాటు మాత్రమే ఆనందాన్ని ఇస్తాయని, కానీ బంగారం తరతరాలకు నిలిచే ఆస్తి అని గుర్తు చేస్తున్నారు.
“ఒక వెకేషన్ ఐదు రోజులు మాత్రమే ఉంటుంది.. కానీ బంగారం ఐదు తరాలు నిలుస్తుంది” అని అనలిస్టులు చెబుతున్నారు. అదే కారణంగా మిడిల్ క్లాస్ కుటుంబాలు పొదుపు లేదా పెట్టుబడుల కోసం బంగారం కొనడమే ఉత్తమమని నిపుణులు సలహా ఇస్తున్నారు. కారు మాత్రం అవసరం ఉన్నప్పుడు మాత్రమే కొనాలని, దానిని ఆస్తిగా కాకుండా సౌకర్యంగా చూడాలని సూచిస్తున్నారు.