Latest Updates
కాంగ్రెస్ చేతకానితనంతో ఎకానమీ పతనమవుతోంది: KTR
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణలో పూర్తిగా విఫలమైందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతోందని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఏజీ (CAG) తాజాగా విడుదల చేసిన నివేదికను ఉదహరిస్తూ, ఇది ప్రమాద ఘంటికలని స్పష్టంగా చెబుతోందని అన్నారు. “ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలకు బదులుగా, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైన ఆర్థిక వ్యవస్థను మాత్రమే అందించింది” అని ఆయన ఎక్స్ (X)లో పేర్కొన్నారు.
మొదటి త్రైమాసికంలోనే రూ.10,583 కోట్ల రెవెన్యూ లోటు నమోదవడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతన దిశగా పయనిస్తోందని కేటీఆర్ అన్నారు. ఒక్క కొత్త రోడ్డు కూడా వేయకుండా, ఏ కొత్త ప్రాజెక్టు ప్రారంభించకుండా, విద్యార్థులకు సరైన భోజనం కూడా అందించకుండానే భారీగా అప్పులు చేయడం కాంగ్రెస్ పాలనలో జరిగిందని విమర్శించారు.
ఇక అప్పుల విషయంలోనూ కాంగ్రెస్‌పై కేటీఆర్ ధ్వజమెత్తారు. కేవలం కొన్ని నెలల పాలనలోనే రూ.20,266 కోట్ల అప్పు చేసి, రాష్ట్ర భవిష్యత్తుపై భారాన్ని మోపారని ఆరోపించారు. అభివృద్ధి పనులు లేకుండా, ప్రగతిశీల ప్రాజెక్టులు ప్రారంభించకుండా, ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేయడం కాంగ్రెస్ పాలనలోని నిర్లక్ష్యానికి నిదర్శనమని కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.