ఒకప్పుడు అమెరికా నుంచి దానం వచ్చిన చిన్న రాకెట్‌తో మొదలైన భారత అంతరిక్ష ప్రయాణం… ఈరోజు ప్రపంచానికి స్ఫూర్తిగా మారింది. 1963లో త్రివేండ్రం సమీపంలోని తుంబా లాంచింగ్ స్టేషన్ నుంచి చిన్న రాకెట్‌ను ప్రయోగించి ఇస్రో తొలి అడుగు వేసింది. ఆ రాకెట్‌ను అమెరికానే ఉచితంగా ఇచ్చింది. అప్పట్లో మనకు అంతరిక్ష సాంకేతికతలో అనుభవం లేకపోయినా, క్రమంగా పరిశోధనలు, సాంకేతిక అభివృద్ధి, నిబద్ధతతో ప్రపంచస్థాయి సామర్థ్యాన్ని సంపాదించుకుంది.
ఈరోజు పరిస్థితి పూర్తిగా మారింది. మనపై అంతరిక్ష పరిశోధనల్లో నమ్మకం పెంచుకున్న అదే అమెరికా ఇప్పుడు భారత సహాయాన్ని కోరుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భూగోళ పరిశీలనా ఉపగ్రహం నిసార్ (NISAR) అభివృద్ధి, ప్రయోగం కోసం నాసా నేరుగా ఇస్రోతో చేతులు కలిపింది. ఈ ప్రాజెక్ట్‌లో ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపే ప్రధాన బాధ్యత ఇస్రోది. ఇది అమెరికా-భారత్ అంతరిక్ష సహకారంలో చరిత్రాత్మక అడుగుగా నిలుస్తోంది.
ఇంతటి విశ్వాసానికి కారణం ఇస్రో సాధించిన తక్కువ ఖర్చుతో గరిష్ట ఫలితాల రికార్డు. PSLV, GSLV వంటి లాంచ్ వాహనాల విజయాలు, అనేక దేశాల ఉపగ్రహాలను సక్సెస్‌గా ప్రయోగించిన అనుభవం మనకు ఈ స్థాయి గుర్తింపును తీసుకువచ్చింది. ఇప్పుడు నాసా మరో భారీ శాటిలైట్ ప్రయోగ బాధ్యతను కూడా ఇస్రోకు అప్పగించింది. భారత అంతరిక్ష శాస్త్రవేత్తల ప్రతిభ, క్రమశిక్షణ, సాంకేతిక నైపుణ్యం ప్రపంచ వేదికపై ఇస్రోను అగ్రశ్రేణి స్థాయికి చేర్చాయి.