Business
ట్రంప్ టారిఫ్స్ ప్రభావం: భారత్ నుంచి ఆర్డర్లు నిలిపివేసిన అమెరికా దిగ్గజాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్‌పై 50 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించిన నిర్ణయం తక్షణ ప్రభావం చూపిస్తోంది. ఈ కొత్త టారిఫ్‌ల దెబ్బతో అమెరికాలోని ప్రముఖ రిటైల్ సంస్థలు భారత్ నుంచి వస్తువుల సరఫరా తాత్కాలికంగా ఆపేయాలని సూచించినట్లు సమాచారం. అమెజాన్, వాల్మార్ట్, టార్గెట్, గ్యాప్ వంటి కంపెనీలు తమ భారతీయ సరఫరాదారులకు ఆర్డర్లు నిలిపివేయాలని ఈమెయిల్స్, లేఖల ద్వారా తెలియజేశాయని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి.
వాణిజ్య నిపుణుల ప్రకారం, ఈ నిర్ణయం వల్ల భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్త్రాలు, లెదర్ ఉత్పత్తులు, హ్యాండీక్రాఫ్ట్‌లు, ఇతర వినియోగ వస్తువుల సరఫరా పెద్ద ఎత్తున దెబ్బతినే అవకాశం ఉంది. అమెరికా మార్కెట్‌లో డిమాండ్ ఉన్నా, అధిక సుంకాల కారణంగా ఉత్పత్తుల ధరలు పెరిగిపోవడంతో పోటీ తగ్గిపోతుందన్న ఆందోళన వ్యాపార వర్గాల్లో నెలకొంది. దీంతో ఆర్డర్ల నిలుపుదల వల్ల భారతీయ ఎగుమతిదారులకు తాత్కాలిక ఆర్థిక భారం తప్పదని అంచనా.
వాణిజ్య రంగం ఆశిస్తున్నది ఏంటంటే, ఇరు దేశాల ప్రభుత్వాలు చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని. టారిఫ్‌లపై సడలింపు వస్తేనే మళ్లీ ఆర్డర్లు పునరుద్ధరించే అవకాశం ఉందని వ్యాపార సంస్థలు చెబుతున్నాయి. అయితే, ప్రస్తుతం అమెరికా కంపెనీలు “తదుపరి అప్డేట్ వచ్చే వరకు సరఫరాలు నిలిపివేయండి” అన్న ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, ఎగుమతిదారులు ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.