Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ కొత్త బార్ పాలసీ విడుదల – సెప్టెంబర్ 1 నుండి అమలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన బార్ పాలసీ 2025 సెప్టెంబర్ 1 నుంచి 2028 ఆగస్టు 31 వరకు అమల్లో ఉంటుంది. ఈ పాలసీ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 840 బార్లకు టెండర్లు నిర్వహించనున్నారు. లాటరీ విధానంలో బార్లను కేటాయించనుండగా, పారదర్శకతకు పెద్దపీట వేసింది. ఈసారి పాలసీలో కల్లు గీత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి 50 శాతం రాయితీతో 10 శాతం బార్లను రిజర్వ్ చేయనున్నారు.
జనాభా ఆధారంగా బార్ లైసెన్స్ ఫీజులు నిర్ణయించగా, 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.30 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాల్లో రూ.55 లక్షలు, 5 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో అయితే రూ.75 లక్షలు ఫీజు విధించనున్నారు. ఇది వ్యాపార స్థాయిని బట్టి బార్ల లాభనష్టాలపై ప్రభావం చూపనుంది. టెండర్లు పొందాలనుకునే వ్యక్తులు ఆర్హత ప్రమాణాలను పూర్తిగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
బార్లకు అనుమతుల విషయంలో ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది. మతపరమైన ప్రాంతాల్లో మాత్రం బార్లకు అనుమతి ఇవ్వబోదు. అయితే మిగతా టూరిస్టు ప్రాంతాల్లో బార్లు ఏర్పాటు చేయడానికి అనుమతి ఉంటుంది. బార్లు ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పని చేయడానికి అనుమతి ఇవ్వబడినట్లు అధికారులు వెల్లడించారు. అదనంగా, అవసరమైన సందర్భాల్లో 1 గంట గ్రేస్ పీరియడ్ కూడా కల్పించనున్నారు.