ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నాలుగు నెలల క్రితం కానిస్టేబుల్ను ప్రేమ వివాహం చేసుకున్న సౌమ్య కశ్యప్ అనే మహిళ, అత్తింటి వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకుంది. ఆమె చనిపోవడానికి ముందు రికార్డ్ చేసిన ఎమోషనల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె తన బాధను వెల్లడిస్తూ తాను అనుభవిస్తున్న మానసిక హింసను వెల్లడించింది.
సౌమ్య పేర్కొన్న వివరాల ప్రకారం, అత్తింటివారు వరకట్నం కోసం వేధించడమే కాకుండా, తన భర్తకు మరో పెళ్లి చేయాలన్న పన్నాగాలు పన్నారని ఆరోపించారు. తన భర్త అంకుల్ ఓ న్యాయవాది కావడంతో, ‘నువ్వు ఆమెను చంపితే నిన్ను కేసు నుంచి బయటపడతాను’ అని భర్తకు హామీ ఇచ్చిన విషయాన్ని సౌమ్య వీడియోలో వెల్లడించారు. పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, ఎవరూ తనకు రక్షణ కల్పించలేదని ఆమె వాపోయారు.
“ఇలా బతకడం నా వల్ల కాదు.. నాకు రక్షణ లేదు” అని తన చివరి మాటల్లో సౌమ్య చెప్పినట్లు సమాచారం. ఆమె మృతి వెనుక ఉన్న కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఘటనపై ఎలాంటి అరెస్టులు జరిగాయన్న విషయం స్పష్టతకు రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తూ పలువురు ఈ విషాద ఘటనపై స్పందిస్తున్నారు.