Andhra Pradesh
వర్షాకాలంలో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి: గోరువెచ్చని నీరే మేలు!
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వాతావరణంలో తేమ స్థాయులు పెరుగుతున్నాయి. దీనివల్ల హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు వేగంగా వ్యాపించే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో శరీరాన్ని రోగనిరోధకంగా ఉంచుకోవడం అవసరమని సూచిస్తున్నారు. తాగునీరు సురక్షితంగా ఉండకపోవడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వర్షపు నీరు లేదా కలుషిత నీరు శరీరంలోకి వెళ్లితే, గ్యాస్ట్రోఎంటరైటిస్, టైఫాయిడ్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో తాగునీటిని కాచిన తరువాత గోరువెచ్చగా తాగడం మంచిదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గోరువెచ్చని నీరు శరీరంలోని ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, ఇమ్యూనిటీని బలపరిచేలా చేస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో హోం రెమెడీస్ ప్రాధాన్యత పెరుగుతుంది. కాషాయాలు, తులసి, అల్లం వంటివి వేసిన నీటిని వేడిగా తాగడం ద్వారా శరీర రోగ నిరోధక శక్తి మెరుగవుతుందని వైద్యులు అంటున్నారు. రోజూ కనీసం రెండు మూడు సార్లు గోరువెచ్చని నీటిని తాగితే ఈ సీజన్‌ను ఆరోగ్యంగా అధిగమించవచ్చని సూచిస్తున్నారు.