ముంబై పేలుళ్ల కేసులో 19 ఏళ్ల తర్వాత కీలక తీర్పు – 12 మంది నిర్దోషులు
2006 జూలై 11న ముంబైలోని లోకల్ ట్రైన్స్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో భారీ మలుపు చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనలో 180 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. దాదాపు 19 ఏళ్ల పాటు న్యాయపరంగా సాగిన విచారణ అనంతరం బాంబే హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో ముందు ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్షలు, జీవిత ఖైదు వంటి తీవ్ర శిక్షలు విధించినా… తాజాగా హైకోర్టు మాత్రం అందులో 12 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాలను సమర్పించడంలో విఫలమైందని, వారు అభియోగాలను నిరూపించలేకపోయారని హైకోర్టు స్పష్టం చేసింది. 2015లో ప్రత్యేక MCOCA కోర్టు ఐదుగురికి ఉరిశిక్ష, ఏడుగురికి యావజ్జీవ శిక్షలు విధించింది. అయితే నిందితుల అప్పీల్‌ను పరిశీలించిన హైకోర్టు, వీరిపై ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని తేల్చింది. ఈ తీర్పుతో నిందితుల కుటుంబాలు భావోద్వేగానికి గురయ్యాయి. ముంబై పేలుళ్ల ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించిన ఘటనగా చరిత్రలో నిలిచిపోయింది.