Latest Updates
హైదరాబాద్‌లో పూజల పేరుతో మోసం: జ్యోతిష్యాలయం గురూజీ పరారీ
పూజల పేరుతో ఓ జ్యోతిష్యాలయం గురూజీ మోసం చేసిన ఘటన నాగోల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. శ్రీరేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయాన్ని నిర్వహిస్తున్న సాయిరాజ్ అనే గురూజీ, కుటుంబ సమస్యల పరిష్కారం కోసం పూజలు చేస్తానని చెప్పి ఓ మహిళను మోసం చేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధిత మహిళ సాయిరాజ్‌ను సంప్రదించగా, ఆయన కుటుంబ సమస్యలు తీర్చడానికి పూజలు చేయాలని, ఇందుకోసం రూ.32 వేల నగదు, 5 తులాల బంగారు ఆభరణాలు అవసరమని చెప్పాడు. ఆమె నగదు, ఆభరణాలు అందజేసిన తర్వాత సాయిరాజ్ జాడ తెలియకుండా పోయాడు. మోసపోయినట్లు గుర్తించిన బాధిత మహిళ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం సాయిరాజ్ పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.