Andhra Pradesh
పిఠాపురం ప్రజలకు ఏపీ సర్కార్ మంచివార్త.. ఉత్తర్వులు కూడా జారీ!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించబడ్డాయి. ప్రభుత్వంలో కీలకమైన శాఖల సమన్వయంతో ‘పిఠాపురం ప్రాంత అభివృద్ధి సంస్థ’ను ఏర్పాటు చేయాలని సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం పిఠాపురంలో ఉంటూ, అక్కడి పనులను పర్యవేక్షించేందుకు సీనియర్ ఆర్డీవోను ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమించాలన్నది ఉత్తర్వులో పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (PADA)గా ఈ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలు, పేదరిక నిర్మూలన కోసం ప్రణాళికలు రూపొందించి పథకాలు అమలు చేస్తారని తెలిపింది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల పిఠాపురం పర్యటించగా, ‘‘పిఠాపురం ప్రాంత అభివృద్ధి సంస్థ’’ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయానికి కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. మొదట పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (PADA) పేరుతో ఈ సంస్థ ఏర్పడేలా ఉన్నా, తర్వాత ‘అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ పిఠాపురం’ అనే పేరుతో ప్రతిపాదన వచ్చి, ఆమోదం పొందింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సంస్థ కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పిఠాపురం ప్రాంత అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
పిఠాపురం ప్రాంతానికి సంబంధించిన వాటిలో ఇటీవల కేబినెట్ పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. వీటిలో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసి, రూ.38.32 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఈ ఆసుపత్రితో పిఠాపురం పరిసర 8 మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం 20 మంది సిబ్బంది ఉన్నారు. అదనంగా 66 పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే, ఫ్రీజర్ కొనుగోలు, మార్చురీ గదికి వెళ్లే రోడ్డు నిర్మాణానికి రూ.1.07 లక్షలు మంజూరు చేయడమైంది. గ్రామీణ రోడ్ల అభివృద్ధికి రూ.10 కోట్లు, రోడ్ల మరమ్మతుల కోసం మరో రూ.3 కోట్లు కేటాయించారు. ఆర్టీసీ బస్టాండును అభివృద్ధి చేయడమేగాక, కేఎస్ఈజెడ్ కోసం ఈ ప్రాంతంలో 10 వేల ఎకరాలు కేటాయించారు.