Latest Updates
అయ్యప్ప భక్తులకు మంచి వార్త.. తెలుగు సహా ఆరు భాషల్లో చాట్‌బాట్ అందుబాటులోకి వచ్చింది.

అయ్యప్ప భక్తులకు మంచి వార్త.. తెలుగు సహా ఆరు భాషల్లో చాట్‌బాట్ అందుబాటులోకి వచ్చింది.
కేరళలోని పత్తనంతిట్టా జిల్లాలో శబరిగిరుల్లో కొలువై ఉన్న అయ్యప్పస్వామి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. 41 రోజుల పాటు దీక్ష చేపట్టి.. ఇరుముడితో వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారు. ఆలయం ఏడాదిలో కేవలం 2 నెలల పాటు మాత్రమే మండల మకరజ్యోతి యాత్ర సీజన్‌లో పూర్తిగా తెరుస్తారు. అయితే, నెలవారీ పూజల కోసం నాలుగు రోజుల పాటు ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి.
కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో శుక్రవారం (నవంబరు 15) నుంచి మండల మకరు విళక్కు యాత్రా సీజన్ ప్రారంభం కానుండగా.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు పూర్తిచేశాయి. తాజాగా, శబరిమల యాత్రికులకు సేవల కోసం ‘స్వామి’ పేరుతో చాట్‌బాట్ అందుబాటులోకి తీసుకొచ్చింది కేరళ సర్కారు. దీనికి సంబంధించిన ‘స్వామి’ చాట్‌బాట్ లోగోను ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవారం ప్రారంభించారు. ముత్తూట్ గ్రూప్ సహకారంతో ఈ చాట్‌బాట్ రూపొందించారు. స్మార్ట్ ఫోన్ ఇంటర్‌ఫేస్ ద్వారా ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సహా ఆరు భాషల్లో స్వయంగానే ఆ అయ్యప్ప స్వామే వివరాలు అందించినట్లుగా సమగ్ర వివరాలు లభ్యమయ్యేలా ఈ చాట్‌బాట్‌ను రూపొందించారు.
శబరిమల సన్నిధానంలో పూజా సమయాలు, ఇతర విశేషాలే కాకుండా.. యాత్రికుల ప్రయాణాలకు సంబంధించి విమానాలు, రైళ్లు సమాచారం, స్థానిక పోలీసుల వివరాలు, అటవీశాఖ సేవలను ‘స్వామి’ ద్వారా పొందవచ్చు. శబరిమల నడక మార్గాల్లో భక్తులకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు జారీచేసి, అప్రమత్తం చేయడానికి భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శబరిమల చరిత్రలోనే తొలిసారి మూడు సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసింది. తిరువనంతపురం ఐఎండీ డైరెక్టర్ నీతా.కె.గోపాల్ బుధవారం మొదటి బులెటిన్‌ను విడుదల చేశారు. గురువారం, శుక్రవారం రోజుల్లో శబరిమలలో భారీ వర్షాలు పడతాయని చెప్పారు.
ఇదిలా ఉండగా నెలవారీ పూజల కోసం కూడా భక్తులు శబరిమలకు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో మండల, మకరవిళక్కు సీజన్‌లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. గురువారం నుంచి మండల పూజల సీజన్ మొదలు కానుందని, భక్తుల సౌకర్యం కోసం దర్శన సమయాన్ని సాయంత్రం 6 గంటలకు పొడిగించినట్టు ఆయన చెప్పారు.
‘‘సన్నిధానం తలుపులు తెల్లవారుజామున 3 గంటలకు తెరిచి దర్శనాలకు అనుమతిస్తాం.. ఇది మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగుతుంది.. తర్వాత రెండు గంటలు నిలిపివేసి.. తిరిగి మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తాం. “రోజుకు 80 వేల మంది భక్తులకు దర్శన టికెట్లు ఇస్తాం. ఇందులో 70 వేలు ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా, మరొ 10 వేలు స్పాట్ బుకింగ్ ద్వారా ఇస్తాం. ఎరుమేలి, వండిపెరియార్, పంపా వద్ద స్పాట్ బుకింగ్ కౌంటర్లు పెట్టాం,” అని ఆయన చెప్పారు. అలాగే, పవిత్రమైన పదునెట్టాంబడి వద్ద సెల్‌ఫోన్లను నిషేధించినట్టు టీడీబీ చైర్మన్ తెలిపారు.