Andhra Pradesh
రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో బుల్లెట్లు కలకలం.. పిఠాపురం నుండి హైదరాబాద్ వెళ్తుండగా!

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. ఓ ప్రయాణికుడి దగ్గర బుల్లెట్లను భద్రతా సిబ్బంది గుర్తించారు. బుధవారం రాత్రి రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న సుబ్బరాజు అనే ప్రయాణికుడిని భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. అతడి దగ్గర 6 బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించి.. వెంటనే అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టు అధికారుల ఫిర్యాదుతో ప్రయాణికుడిని కోరుకొండ పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. నిబంధనలను అతిక్రమించి ఎయిర్ పోర్టులోకి బుల్లెట్లు తీసుకురావడంపై ఆరా తీశారు.
ప్రయాణికుడు నుంచి స్వాదీనం చేసుకున్న ఆరు బుల్లెట్లను సీజ్ చేశారు. అతడికి బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ప్రయాణికుడు సుబ్బరాజు విజయవాడకు చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. ఆయన పిఠాపురం పెళ్లికి హాజరై హైదరాబాద్‌కు వెళ్తుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. తనకు గన్ లైసెన్స్ ఉన్నట్లు ప్రయాణికుడు సుబ్బరాజు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఆయనపై కేసు నమోదు చేసే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.