Connect with us

Latest Updates

హిందూ ఆలయ పునర్నిర్మాణానికి ముందుకొచ్చిన పాక్..

రూ. కోటి కేటాయింపు హిందూ ఆలయ పునర్నిర్మాణానికి ముందుకొచ్చిన పాక్..

పంజాబ్ ప్రావిన్స్‌లోని నరోవర్ జిల్లాలో మొత్తం 45 ఆలయాలు ఉండగా ప్రస్తుతం అవన్నీ శిథిలావస్థకు చేరుకుని ఒక్కటి కూడా ఉపయోగంలో లేదు. దీంతో ఈ ఆలయం పూర్తయితే చిరకాల కోరిక నెరవేరుతుందని స్థానిక హిందువులు భావిస్తున్నారు. పాకిస్తాన్‌లో హిందూ ఆలయాలను కూల్చివేయడమే మనం ఇప్పటివరకు చూశాం. కానీ ఇప్పుడు మాత్రం ఎన్నో దశాబ్దాల క్రితం నాటి హిందూ ఆలయాన్ని పునర్నిర్మించడానికి భారీగా నిధులు కేటాయించింది. ఆ ఆలయాన్ని పునర్నిర్మించిన తర్వాత దాన్ని పాక్ ధర్మస్థాన్ కమిటీకి అప్పగించనున్నారు.

భారత్, పాక్ విడిపోయిన తర్వాత.. పాక్ భూభాగంలో ఉన్న హిందూ ఆలయాలపై దాడులు జరగడం, విగ్రహాలు, ఆలయాలను ధ్వంసం చేయడం, పూర్తిగా నాశనం చేసిన ఘటలు జరిగాయి. దీంతో అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులు అనేక దాడులు, హింసకు, అణిచివేతకు గురయ్యారు. ఇప్పటికీ పాక్‌లో మైనారిటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా అక్కడ ఉన్న పురాతన హిందూ దేవాలయాన్ని పునర్నిర్మించేందుకు పాక్ ప్రభుత్వం ముందుకు వచ్చి.. డబ్బులు కేటాయించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన దేశ విభజనతో భారత్, పాక్ వేరు పడ్డాయి. హిందువులు ఎక్కువగా భారత భూభాగంలో ఉండగా.. ముస్లింలు ఎక్కువగా పాకిస్తాన్ వెళ్లిపోయారు. అయితే రెండు దేశాల్లోనూ హిందువులు, ముస్లిం ప్రజలు.. వారి ఆలయాలు, సమీదులు ఉన్నాయి.

పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న ఈ హిందూ దేవాలయం 1960 నుంచి మూతపడింది. అయితే ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని 20 ఏళ్ల క్రితమే పాక్‌ ధర్మస్థాన్‌ కమిటీ సిఫారసు చేసింది. అయినా అప్పటి నుంచి పాక్ ప్రభుత్వాలు పట్టించుకోకపోగా.. చివరికి ఇన్నేళ్లకు ఆ ఆలయ పునర్నిర్మానానికి నిధులు దక్కాయి. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని నరోవల్ జిల్లా జఫర్యాల్ ప్రాంతంలో ఉన్న 64 ఏళ్ల నాటి బావోలీ సాహిబ్ హిందూ దేవాలయాన్ని పునరుద్ధరించేందుకు అక్కడి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.కోటి బడ్జెట్ కేటాయించినట్లు సోమవారం మీడియాకు వెల్లడించింది.

పాక్‌ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన షోయబ్‌ సిద్ధాల్‌ నేతృత్వంలోని ఏకసభ్య కమిటీ ఛైర్మన్‌ షోయబ్‌ సిద్ధాల్‌, నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిటీ సభ్యుడు మంజూర్‌ మసీ.. ఈ ఆలయాన్ని పునర్నిర్మించేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఆలయాన్ని పునర్నర్మిస్తున్నందుకు పాక్‌ ప్రభుత్వానికి ధర్మస్థాన్‌ కమిటీ అధ్యక్షుడు సావన్‌ చంద్‌ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ బావోలీ సాహిబ్ ఆలయాన్ని ద ఎవాక్యూ ట్రస్ట్‌ ప్రాపర్టీ బోర్డు -ఈటీపీబీ పర్యవేక్షిస్తోంది. ఇక ఈ ఆలయ పునర్నిర్మాణం పూర్తి అయిన తర్వాత దాన్ని ధర్మస్థాన్‌ బోర్డుకు అప్పగించనున్నారు.

ఇక పాక్ ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం పాకిస్థాన్‌లో దాదాపు 75 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. అయితే 90 లక్షల మంది వరకు హిందువులు ఉంటారని స్థానికులు పేర్కొంటున్నారు. ఇక ఎక్కువ మంది హిందూ జనాభా పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో స్థిరపడ్డారు.
ఇక ఈ బావోలీ సాహెబ్ దేవాలయాన్ని నిర్మించే స్థలానికి 4 వైపులా ప్రహరీగోడను నిర్మించిన తర్వాత దాన్ని పాక్ ధర్మస్థాన్ కమిటీకి అప్పగించనున్నారు. నరోవర్ జిల్లాలో దాదాపు 1500 మంది హిందువులు ఉన్నప్పటికి ఒక్క హిందూ దేవాలయం కూడా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం నరోవర్ జిల్లాలోని హిందువులు దేవాలయానికి వెళ్లాలంటే.. లాహోర్ గానీ, సియాల్ కోట్ గానీ వెళ్లాల్సి ఉంటుంది. ఒకప్పుడు నరోవల్ జిల్లాలో మొత్తం 45 హిందూ దేవాలయాలు ఉండగా.. వాటిని పట్టించుకునే వారు లేకపోవడంతో అవన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *