Connect with us

Andhra Pradesh

అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు.. వరదలో చిక్కుకున్న అక్కినేని నాగార్జున

బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకి ఈ రెండు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే ఓ ప్రైవేట్ కార్యక్రమం కోసం అనంతపురం జిల్లాకు వచ్చిన టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున.. ఈ వరదల్లో చిక్కుకుపోయారు. ఓ జ్యువెలరీ షాప్‌కు నాగార్జున బ్రాండ్ అంబాసిడర్ అన్న సంగతి మనకి తెలిసిందే. ఈ జ్యువెలరీ షాపు అనంతపురంలో కొత్త బ్రాంచ్ ప్రారంభించింది. ఇక ఈ బ్రాంచ్ ఓపెనింగ్ కోసం అనంతపురం వచ్చిన అక్కినేని నాగార్జున వరదల్లో చిక్కుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్కినేని నాగార్జున మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరారు. ఓ ప్రైవేట్ విమానంలో అక్కడి నుంచి పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక పుట్టపర్తి ఎయిర్ పోర్టు నుంచి అనంతపురానికి కారులో బయల్దేరగా.. మార్గమధ్యలో ఇరుక్కుపోయారు. భారీ వర్షాల కారణంగా ధర్మవరం నుంచి అనంతపురం వెళ్లే రహదారిపై వరదనీరు ఎక్కువుగా ప్రవహించి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. దీంతో కారులో ఉన్న నాగార్జున అక్కడే చిక్కుకుపోయారు. అయితే నిర్వాహకులు మరో మార్గంలో అక్కడి నుంచి నాగార్జునను అనంతపురం తీసుకువెళ్లారు. చివరకు అనంతపురం చేరుకున్న అక్కినేని నాగార్జున.. జ్యువెలరీ షాపు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జునను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు.

మరోవైపు సోమవారం రాత్రి కురిసిన వర్షానికి పండమేరు వాగు పొంగి ప్రవహించడంతో.. అనంతపురం నగరంలో పలు కాలనీలు నీట మునిగాయి. ఉప్పరపల్లి పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీతో పాటుగా.. వాగుకు పక్కనే ఉన్న కాలనీలు నీటమునిగాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంకోవైపు కనగానపల్లి మండలం ముక్తాపురం చెరువు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంది. అలాగే పండమేరు వాగు ఉద్ధృతితో హైదరాబాద్- బెంగళూరు నేషనల్ హైవే మీద వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

Loading