Connect with us

Entertainment

రజినీ అభిమానులకు గుడ్‌న్యూస్.. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినా సూపర్‌స్టార్..

తమిళ తలైవా.. సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు శుభవార్త. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను వైద్యులు శనివారం డిశ్చార్జ్ చేశారు. కొన్ని రోజుల కిందట అస్వస్థతకు గురైన రజినీకాంత్.. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన విషయం అందరికి తెలిసిందే. చికిత్స అనంతరం కోలుకున్న ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో డిశ్చార్జ్ అయ్యారు. చెన్నై లో ఉండే అపోలో ఆస్పత్రి నుంచి ఆయన నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడటంతో డాక్టర్లు ఆయనకు స్టెంట్ అమర్చారు. ట్రాన్స్కాథెటర్ పద్ధతి ద్వారా తలైవాకు స్టెంట్ వేసినట్టు అపోలో ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ఇక తమ అభిమాన నటుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో.. చెన్నైలో తలైవా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక వచ్చే వారమే రజినీకాంత్ నటించిన కొత్త సినిమా వెట్టియాన్ దసరా కానుకగా విడుదల కానుంది. సెప్టెంబర్ 30న ఛాతిలో నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైన రజినీని కుటుంబసభ్యులు వెంటవెంటనే చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యుల బృందం, గుండె నుంచి బయటికి వచ్చే రక్తనాళంలో వాపు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం స్టెంట్ అమర్చడంతో రెండు రోజుల అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో శుక్రవారం ఉదయం ఇంటికి పంపారు. రజినీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉండటంతో శుక్రవారం ఆయనను డిశ్చార్జ్ చేస్తామని అపోలో ఆసుపత్రి గురువారం వెల్లడించిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

తమ అభిమాన నటుడు రజినీకాంత్ అనారోగ్యం పాలయ్యారని తెలిసి అభిమానులు, సన్నిహితులు, రాజకీయ ప్రముఖులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తలైవా త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు. ఈ క్రమంలో ఆయన భార్య లతా మీడియా ముందుకు వచ్చి స్పందించారు. రజనీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె ప్రకటన చేశారు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని లత కోరారు. రజనీ క్షేమంగా ఉన్నారని.. అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

దాంతో సినిమా విడుదలకు ముందు ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో కుటుంబ సభ్యులు అలానే అభిమానులు మరింత ఆనందంలో మునిగి తేలుతున్నారు.

Loading