Telangana
తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు.. TPCC చీఫ్ కీలక అప్డేట్

తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు.. TPCC చీఫ్ కీలక అప్డేట్, మరో 4 రోజుల్లోనే..
Telangana Local body elections: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కులగణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నాలుగు రోజుల్లోనే అందుకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపైనా మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో పలువురు లోకల్ లీడర్లు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయిపోయారు. ప్రజలను మచ్చిక చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మంచి చెడులకు హాజరై.. ప్రతి సందర్భాన్ని పక్కాగా వాడుకుంటూ గ్రామాల్లోని ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1తో సర్పంచ్ల పదవీ కాలం ముగియగా.. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలపై నిర్వహణపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక అప్డేట్ ఇచ్చారు. రిజర్వేషన్ల ఖరారు తర్వాతే సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఉంటుందన్నారు. రానున్న 4 రోజుల్లో కులగణన గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం విడుదల చేయనుందని చెప్పారు. కులగణన కాంగ్రెస్ పేటెంట్ అని, ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే స్థానిక ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ కులగణనను పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. క్యాస్ట్ సెన్సస్‌కు బీజేపీ వ్యతిరేకమని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.
ఇక BC రిజర్వేషన్లలను 42 శాతం పెంచాలని గత కొంత కాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీసీ కులగణన ప్రక్రియను వేగంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ బీసీ కమిషన్‌ను తాజాగా కోరారు. బీసీ కులగణన ప్రక్రియ వీలైనంత తొందరగా పూర్తయ్యేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని కమిషన్‌కు హామీ ఇచ్చారు. కుల గణన ప్రక్రియ విషయంలో సమగ్రంగా అధ్యయనం చేయాలని.. అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించాలని సీఎం కమిషన్‌కు సూచించారు.