బంగారం కొనాలని చూస్తున్న వారికి మరోసారి ఊహించని షాక్ తగిలింది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు వరుసగా తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో తాజాగా పసిడి, వెండి రేట్లు గణనీయంగా పెరిగాయి. అయితే ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఈ ప్రభావం ఉదయం 10 గంటల తర్వాత రిటైల్ మార్కెట్లో కనిపించే అవకాశం ఉంది.
ఇటీవల ఆల్‌టైమ్ హై స్థాయిల వద్ద ఉన్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీ కరెక్షన్కు గురయ్యాయి. దేశీయంగానే కాదు, అంతర్జాతీయ మార్కెట్లో కూడా ధరలు భారీగా పతనమయ్యాయి. దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.25 వేల వరకు తగ్గగా, 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు రూ.30 వేల వరకు పడిపోయింది. అంతర్జాతీయంగా చూస్తే బంగారం ధర దాదాపు 20 శాతం తగ్గగా, వెండి అయితే ఏకంగా 40 శాతం వరకు కుప్పకూలింది. MCX మార్కెట్లు, గోల్డ్–సిల్వర్ ETFలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
జనవరి 29న ప్రారంభమైన ఈ కరెక్షన్ ఫిబ్రవరి 2 వరకు కొనసాగింది. అయితే అక్కడి నుంచి మళ్లీ ట్రెండ్ మారినట్లు కనిపిస్తోంది. గత రెండు రోజుల్లో ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజులోనే రూ.5,050 పెరిగి తులం రూ.1,46,150కు చేరింది. అంతకు ముందు రోజు రూ.750 పెరిగింది. ఇక అంతకుముందు మూడు రోజుల్లో వరుసగా రూ.6,800, రూ.7,900, రూ.8,850 చొప్పున తగ్గింది.
24 క్యారెట్ల బంగారం ధర కూడా ఒక్కసారిగా రూ.5,510 పెరిగి ప్రస్తుతం 10 గ్రాములకు రూ.1,59,440 వద్ద ట్రేడ్ అవుతోంది.
వెండి విషయానికి వస్తే… ఒక్కరోజులోనే కేజీకి రూ.20 వేల పెరుగుదల నమోదై హైదరాబాద్ మార్కెట్లో రూ.3.20 లక్షలకు చేరింది. అయితే జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2 మధ్య వెండి ధర మొత్తం రూ.1.25 లక్షల వరకు పడిపోయింది. ఇందులో ఒకేరోజు రూ.85 వేల భారీ పతనం కూడా చోటు చేసుకుంది.
అంతర్జాతీయ మార్కెట్‌ను పరిశీలిస్తే, రాత్రికి రాత్రే మళ్లీ బంగారం, వెండి ధరలు తగ్గాయి. స్పాట్ గోల్డ్ ధర గత రోజు ఔన్సుకు 5,100 డాలర్లకు చేరగా, ఫిబ్రవరి 5 ఉదయం 8 గంటలకు 4,900 డాలర్ల స్థాయికి పడిపోయింది. అంటే దాదాపు 200 డాలర్ల తగ్గుదల నమోదైంది. వెండి ధర కూడా 90 డాలర్ల నుంచి 82 డాలర్లకు దిగివచ్చింది. దీని ప్రభావంతో దేశీయ మార్కెట్లో కూడా ఫిబ్రవరి 5 ఉదయం 10 గంటల తర్వాత ధరలు తగ్గే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.