National
8వ వేతన సంఘం: ఉద్యోగులకు స్వీట్ న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి గుడ్ న్యూస్ అందింది. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటు చేస్తూ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ, సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రంజన్ దేశాయ్ 8వ వేతన సంఘానికి ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారని తెలిపారు. ఇంకా ఇద్దరు సభ్యులు ఈ కమిషన్‌లో భాగమవుతారని వివరించారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం కాలపరిమితి 2026లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల సవరణ కోసం కేంద్ర ప్రభుత్వం ముందుగానే 8వ వేతన సంఘం ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. వేతన సవరణలు, భత్యాలు, ఇతర ప్రయోజనాలపై సవివరంగా పరిశీలన చేయడం ఈ కమిషన్ ప్రధాన బాధ్యతగా ఉంటుంది.
జనవరి నెలలోనే కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటుపై ప్రాథమిక ప్రకటన చేసింది. అనంతరం మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య జరిగిన చర్చల తర్వాత కేబినెట్ ఈ నిర్ణయానికి ముద్ర వేసింది. ఈ కమిషన్ తన తుది నివేదికను వచ్చే 18 నెలల్లో సమర్పించనుందని సమాచారం. దీని ఆధారంగా కొత్త వేతన సవరణలు 2026 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. 7వ వేతన సంఘం తర్వాత మరోసారి భారీ వేతన పెంపు ఆశలు కలిగాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగుల ఆర్థిక స్థితి మెరుగుపడటమే కాకుండా, పెన్షన్ దారులకు కూడా పెద్ద ఊరటను కలిగించనుంది.
![]()
