International
ఢిల్లీ-రాంచీ ఎయిరిండియా విమానంలో సమస్య.. వెనక్కి మళ్లింపు
ఢిల్లీ నుంచి రాంచీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం తిరిగి ఢిల్లీకి మళ్లించారు. సోమవారం (జూన్ 16, 2025) ఢిల్లీ నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఈ సమస్యను గుర్తించిన పైలట్, ముందు జాగ్రత్తగా విమానాన్ని వెనక్కి తీసుకొచ్చి సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ చేశాడు. ఈ విమానం బోయింగ్ 737 మ్యాక్స్ 8 మోడల్‌కు చెందినదని, రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయంలో సాయంత్రం 6:20 గంటలకు ల్యాండ్ కావాల్సిందని తెలుస్తోంది. సాంకేతిక సమస్యను పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేసిన తర్వాత విమానం మళ్లీ బయలుదేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఎయిర్ ఇండియా విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు తలెత్తడం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇదే రోజు మధ్యాహ్నం జ్యూరిచ్ నుంచి ఢిల్లీకి రావాల్సిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానంలో కూడా సాంకేతిక లోపం ఏర్పడింది. అలాగే, హాంకాంగ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన మరో విమానం (ఏఐ 315) కూడా సాంకేతిక సమస్య కారణంగా తిరిగి హాంకాంగ్‌కు మళ్లించబడింది. ఈ ఘటనలు ఎయిర్ ఇండియా విమానాల భద్రత, నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత, బోయింగ్ 787 విమానాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని భారత విమానయాన శాఖ ఆదేశించిన సంగతి తెలిసిందే.