National
25 పెళ్లిళ్లు చేసుకున్న కిలేడి.. చివరకు
రాజస్థాన్‌లో సంచలనం సృష్టించిన ఓ యువతి కథ ఇది! కేవలం ఏడు నెలల వ్యవధిలో 25 మందిని పెళ్లి చేసుకుని, వారి డబ్బు, బంగారు ఆభరణాలతో పరారైన అనురాధ పాస్వాన్ అనే యువతి చివరకు పోలీసుల పట్టున దొరికింది. ఈమె తనను ఒంటరి, పేద మహిళగా చూపించి, అమాయక వధువుగా నటించి వరుడి కుటుంబాలను నమ్మించేది. ఆమె తన గ్యాంగ్‌తో కలిసి, కుటుంబ సభ్యులను మోసం చేసి, వారి సొమ్మును దోచుకునేది. ఈ ఘటన రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ ప్రాంతంలో వెలుగు చూసింది, ఒక బాధితుడి ఫిర్యాదుతో ఈ మోసం బయటపడింది.
అనురాధ పాస్వాన్ మోసపూరిత వివాహాలు చేసే విధానం అత్యంత చాకచక్యంగా ఉండేది. ఆమె అత్తారింట్లో అమాయకంగా నటిస్తూ, కుటుంబ సభ్యులకు మత్తు మందు కలిపిన ఆహారం ఇచ్చి, వారు నిద్రలోకి జారుకున్న తర్వాత నగదు, బంగారం తీసుకుని పరారయ్యేది. ఈ కిలాడీ లేడీ ఏకంగా 25 మందిని మోసం చేసి, లక్షల విలువైన ఆస్తులతో జంప్ అయ్యింది. అయితే, సవాయ్ మాధోపూర్ పోలీసులు ఆమెను ఒక నకిలీ పెళ్లి ఉచ్చుతో భోపాల్‌లో అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ యువతి కటకటాల వెనక్కి వెళ్లి, తన మోసాలకు లెక్కలు చెల్లిస్తోంది.