200 కోట్ల మంది మహిళలకు ఉచిత ప్రయాణం – RTCలో మరో చరిత్ర
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఓ కీలక మైలురాయిని అధిగమించింది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తూ, ఇప్పటివరకు 200 కోట్ల మంది ప్రయాణించినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉండటంతో, ఈ భారీ ప్రయాణ గణాంకం సాధ్యమైందని తెలిపారు. ఈ పథకం అమలులో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం RTCకి రూ.6,700 కోట్లకు పైగా నిధులను విడుదల చేసినట్లు వెల్లడించారు.
ఈ ఉచిత ప్రయాణ పథకం ద్వారా రాష్ట్రంలోని మధ్య తరగతి, పేద మహిళలకు గణనీయమైన ఆర్థిక లాభం లభిస్తోందని మంత్రి తెలిపారు. ప్రతి మహిళ నెలకు సగటున రూ.4,000 నుంచి రూ.5,000 వరకు ప్రయాణ ఖర్చు ఆదా చేసుకుంటోందని విశ్లేషించారు. ఉద్యోగం, విద్య, వ్యాపారం, ఇతర అవసరాల కోసం బస్సు ప్రయాణించే మహిళలకు ఇది ఒక గొప్ప ఆర్థిక ఉపశమనం అని పేర్కొన్నారు. మహిళల సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు.
ఈ చారిత్రక మైలురాయిని పురస్కరించుకుని రేపు రాష్ట్రవ్యాప్తంగా RTC సంబరాలు జరపనుంది. రాష్ట్రంలో మొత్తం 97 బస్సు డిపోలలో, 341 బస్ స్టేషన్లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి తెలిపారు. మహిళల సేవకు అంకితమైన డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందిని ప్రభుత్వం అభినందించాలని, ఈ సంబరాలు RTCలో కొత్త ఉత్సాహం నింపాలని ఆయన ఆకాంక్షించారు.