News
2 నెలల్లో పంచాయతీ ఎన్నికలు?
తెలంగాణలో గ్రామ పంచాయతీ, జిల్లా మరియు మండల పరిషత్, మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. జూలై మరియు ఆగస్టు నెలల్లో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, భూభారతి వంటి పథకాలను అమలు చేస్తూ ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని సంపాదించిందని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. ఈ పథకాలు ప్రజలకు దగ్గరవడంతో పాటు, ఎన్నికల్లో అధికార పార్టీకి లాభం చేకూరుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఓటరు జాబితాల తయారీ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, బ్యాలెట్ బాక్సుల సిద్ధీకరణ వంటి పనులను వేగవంతం చేసింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి మొదలుకానుందని, గ్రౌండ్ రిపోర్టుల ఆధారంగా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. ఈ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. సర్పంచ్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సమాచారం. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం స్పష్టతకు వచ్చిన నేపథ్యంలో, ఎన్నికల ప్రక్రియను త్వరలో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఎన్నికలు రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని మరింత ఉత్తేజపరిచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.