Health
హైదరాబాద్: ప్యాకెట్ పాలు కొంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి..!
హైదరాబాద్ నగర శివారులోని మేడిపల్లి పరిధిలో కల్తీ పాల కలకలం చోటు చేసుకుంది. పర్వతాపూర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఏర్పాటు చేసిన అక్రమ పాల తయారీ కేంద్రంపై స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT) పోలీసులు దాడి చేశారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్యాన్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌తో మానవ ఆరోగ్యానికి హానికరమైన నకిలీ పాలు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడిలో మొత్తం 110 లీటర్ల కల్తీ పాలు, 1.1 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 19 గ్యాన్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ప్యాకెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దీంతో పాటు, ఈ కల్తీ పాల తయారీ వ్యాపారాన్ని నడుపుతున్న గంగలపూడి మురళీకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కల్తీ పాల తయారీకి వినియోగిస్తున్న కెమికల్స్ వల్ల ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదం ఉన్నందున మరింత లోతుగా విచారణ జరుపనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇది నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా కల్తీ పాల మాఫియా కొనసాగుతుందన్న అనుమానాలకు తావిస్తోందని అధికారులు వెల్లడించారు.