News
హుస్సేన్‌సాగర్‌కు కొత్త మేకోవర్ – రూ.200 కోట్ల స్కైవాక్, నీటిపై తేలే క్రికెట్ స్టేడియం!
తెలంగాణ రాజధాని హైదరాబాదులోని హుస్సేన్‌సాగర్ పరిసరాలు త్వరలోనే కొత్త చరిత్రను రాసేలా మారనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం, హుస్సేన్‌సాగర్‌ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయేందుకు రూ.200 కోట్ల ప్రాజెక్టును తీసుకొస్తోంది.
ఈ ప్రాజెక్టు కింద, ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి మొదలై, ఐమాక్స్ మీదుగా ఇందిరా పార్క్ వరకు సుమారు 10 కిలోమీటర్ల పొడవులో స్కైవాక్ నిర్మించనున్నారు. ఇది కేవలం నడిచే మార్గమే కాదు – దాని చుట్టూ 24 గంటల పాటు తెరిచి ఉండే రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ఫుడ్ కోర్ట్స్, ఇతర వినోద సదుపాయాలు కూడా ఏర్పాటవుతాయి.
ఇది దేశంలోనే తొలిసారిగా ఇంత పెద్ద స్కై వాక్ ప్రాజెక్ట్గా చరిత్రలో నిలవనుంది. అంతేకాదు, స్కైవాక్ పాటు ప్రత్యేక సైక్లింగ్ ట్రాక్, నీటిపై తేలే క్రికెట్ స్టేడియం కూడా నిర్మించాలన్న ప్రతిపాదనలపై అధికారులు పని మొదలుపెట్టారు.
ఈ ప్రాజెక్టు కోర్ అర్బన్ బ్యూటిఫికేషన్లో భాగంగా తీసుకువస్తుండగా, దీనిపై గతంలోనే హెచ్‌ఎండీఏ (HMDA) మరియు హ్యూమ్టా (HUMTA) ప్రణాళికలు సిద్ధం చేశాయి. అప్పట్లో కొన్ని కారణాల వల్ల వాయిదా పడినా, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ దీన్ని ప్రస్తావించడంతో ప్రాజెక్టుకు వేగం చేకూరింది.
పర్యాటకులను ఆకట్టుకునే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డిజైన్ చేయబోయే ఈ ప్రాజెక్టు, హైదరాబాద్‌కు మరింత అందం తెచ్చిపెట్టనుంది. నగరంలోని యువతకు, కుటుంబాలకు, విదేశీ పర్యాటకులకు ఇది కొత్త హంగులను అందించనుందని భావిస్తున్నారు.