Health
హవ్‌మోర్ ఐస్‌క్రీమ్‌లో బల్లి తోక: అహ్మదాబాద్‌లో కలకలం, షాపు సీజ్
వేసవి కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ఐస్‌క్రీమ్‌లను ఇష్టంగా ఆస్వాదిస్తుంటారు. అయితే, అహ్మదాబాద్‌లోని మణినగర్ ప్రాంతంలో హవ్‌మోర్ ఐస్‌క్రీమ్‌లో బల్లి తోక కనిపించడం సంచలనం రేపింది. స్థానిక మహిళ ఒకరు మహాలక్ష్మి కార్నర్‌లోని హవ్‌మోర్ ఐస్‌క్రీమ్ షాపు నుంచి నాలుగు కోన్ ఐస్‌క్రీమ్‌లు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లి తింటుండగా, ఒక కోన్‌లో బల్లి తోక ఉన్నట్లు గుర్తించారు. దీని తర్వాత ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు కావడంతో వెంటనే ఆస్పత్రిలో చేరారు. ఈ ఘటనను ఆమె వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో విషయం వైరల్ అయ్యింది.
ఈ ఘటనపై ఆ మహిళ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC) అధికారులకు ఫిర్యాదు చేశారు. AMC ఆహార భద్రతా విభాగం వెంటనే స్పందించి, మహాలక్ష్మి కార్నర్ షాపును తనిఖీ చేసింది. ఈ షాపు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 కింద లైసెన్స్ లేకుండా నడుస్తున్నట్లు గుర్తించి, వెంటనే సీజ్ చేసింది. అలాగే, హవ్‌మోర్ ఐస్‌క్రీమ్ యూనిట్ (నరోడా, అహ్మదాబాద్)పై రూ.50,000 జరిమానా విధించి, సంబంధిత బ్యాచ్ ఉత్పత్తులను రీకాల్ చేయాలని ఆదేశించింది. హవ్‌మోర్ సంస్థ ప్రతినిధి ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, బాధిత మహిళతో సంప్రదించి, సమగ్ర విచారణ జరుపుతున్నామని తెలిపారు.