Business
సృష్టి ఫెర్టిలిటీ కేసు.. నేరం అంగీకరించిన డా.నమ్రత
హైదరాబాద్: సృష్టి ఫెర్టిలిటీ కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. కన్ఫెషన్ రిపోర్టులో ఆమె ఇచ్చిన వివరాలు బయటకు రావడంతో, ఈ కేసు మళ్లీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. IVF, సరోగసీ ట్రీట్మెంట్ పేరుతో అనేక మందిని మోసం చేసి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆమె చెప్పినట్టు పోలీసులు తెలిపారు.
డాక్టర్ నమ్రత ప్రకారం, చికిత్సలు అసలు చేయకుండానే ఒక్కో కుటుంబం నుంచి రూ.30 లక్షల వరకు వసూలు చేశారని వెల్లడించింది. అంతేకాకుండా గర్భస్రావం కోసం వచ్చే మహిళలకు మభ్యపెట్టి, డెలివరీ తర్వాత పుట్టిన శిశువులను కొనుగోలు చేసే వ్యవహారంలో కూడా తాము పాల్గొన్నామని అంగీకరించింది. ఈ వ్యవహారంలో డబ్బు ఆశ చూపడం, నకిలీ వాగ్దానాలతో బాధితులను మోసం చేయడం జరుగుతోందని పోలీసుల దర్యాప్తులో తేలింది.
పోలీసుల సమాచారం ప్రకారం, ఈ చీకటి రహస్య వ్యాపారంలో ఏజెంట్లు సంజయ్, సంతోషి కీలక పాత్ర పోషించారని నమ్రత ఒప్పుకున్నది. అంతేకాకుండా తన కుమారుడు కూడా ‘లీగల్ సహకారం’ పేరుతో ఈ పనిలో భాగస్వామిగా వ్యవహరించేవాడని పేర్కొంది. ఇంతటి ఘోర రహస్యాలు వెలుగులోకి రావడంతో, ఫెర్టిలిటీ సెంటర్ల నియంత్రణ, వైద్య రంగంలో జరుగుతున్న మోసాలపై మరింత ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.