Latest Updates
సనాతనంపై కమల్ హాసన్ వ్యాఖ్యలు.. నెట్టింట తీవ్ర విమర్శలు
రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ తాజా వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదంగా మారాయి. తమిళ నటుడు సూర్య ఆధ్వర్యంలో పనిచేస్తున్న ‘అగరం ఫౌండేషన్’ నిర్వహించిన ఓ విద్యా సంబంధిత కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, “విద్య అనేది నియంతృత్వాన్ని, సనాతన సిద్ధాంతాలను ఛిన్నాభిన్నం చేసే శక్తివంతమైన ఆయుధం” అంటూ వ్యాఖ్యానించారు. ఈ మాటలతో సనాతన ధర్మాన్ని ఆయన లక్ష్యంగా తీసుకున్నట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
కమల్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సనాతన ధర్మం అంటే అజ్ఞానం కాదని, అది వేలేళ్లకు పైగా ప్రాచీన జ్ఞాన స్రోతస్సు అని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. “సనాతనమే అజ్ఞానం నుంచి విముక్తి కలిగిస్తుందని, అది నియంతృత్వాన్ని ప్రోత్సహించదని” పలువురు వాదిస్తున్నారు. విద్య అనేది నిజాలను చాటి చెప్పే శక్తిగా మారుతుందే తప్ప, సంప్రదాయాలను ధ్వంసం చేసే సాధనంగా మారరాదని కామెంట్లు చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో కమల్ హాసన్ తరచూ తన వ్యాఖ్యల ద్వారా వివాదాలకు దారితీస్తున్నారు. బహుశా రాజకీయ ఆలోచనలతో కూడిన పరిణితి ప్రసంగంగా ఆయన ఈ మాటలు చెప్పి ఉంటారని కొంతమంది అనుకుంటున్నా, బహుళ విశ్వాసాల దేశంలో సాంప్రదాయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం విరుచుకుపడే చర్యగా మారుతోందన్నది నెటిజన్ల అభిప్రాయం. కాగా, ఈ వ్యాఖ్యలపై కమల్ హాసన్ నుంచి ఇంకా స్పందన రాలేదు.