Andhra Pradesh
సంపద సృష్టి జరగకపోతే పథకాలు చేపట్టలేం: CM చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) వార్షిక సమ్మేళనంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సంపద సృష్టి జరిగితేనే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని, అది లేకపోతే సంక్షేమ పథకాలను అమలు చేయడం సాధ్యం కాదని ఆయన అన్నారు. “సమాజానికి ఇప్పుడు అవసరం పారిశ్రామికవేత్తలే. నేను మొదటి నుంచి పరిశ్రమలను ప్రోత్సహిస్తూ వచ్చాను. సంపద సృష్టిలో పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్‌కు సహకరించాలి” అని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు పరిశ్రమలను ప్రోత్సహించడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించినట్లు చంద్రబాబు వెల్లడించారు.
సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో స్వర్ణాంధ్ర విజన్ 2047ను ప్రస్తావిస్తూ, రాష్ట్ర ఆర్థిక వృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, పారిశ్రామిక పునరుజ్జీవనం, ఆవిష్కరణలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి, ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆయన ఉద్ఘాటించారు. “మేము ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాన్ని అవలంబిస్తున్నాం. ఇది పెట్టుబడులను తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుంది” అని ఆయన అన్నారు. రాష్ట్రంలో గతంలో సాధించిన 13.5% వృద్ధి రేటును ప్రస్తావిస్తూ, ఇప్పుడు 15% వృద్ధి రేటును సాధించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.