International
శ్రీలంకలో పహల్గామ్ ఉగ్రదాడి నిందితుల కోసం భారీ గాలింపు
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి పాల్పడిన నిందిత టెర్రరిస్టులు శ్రీలంకకు పరారైనట్లు సమాచారం. భారత భద్రతా సంస్థల నుంచి అందిన ఆధారాల ఆధారంగా, ఈ ఉగ్రదాడికి సంబంధించిన ఆరుగురు అనుమానితులు చెన్నై నుంచి శ్రీలంకలోని బండారనాయకే అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సమాచారం అందుకున్న వెంటనే శ్రీలంక పోలీసులు బండారనాయకే విమానాశ్రయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, నిందితులను పట్టుకునేందుకు విస్తృత సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అలాగే, దేశంలోని ఇతర విమానాశ్రయాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేసి, తనిఖీలను ముమ్మరం చేశారు. నిందితుల కదలికలను గుర్తించేందుకు శ్రీలంక అధికారులు భారత భద్రతా సంస్థలతో సమన్వయంతో పనిచేస్తున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ అనుమానితుల కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకునేందుకు శ్రీలంక ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది.