Latest Updates

శారదా పీఠం భూములపై వివాదం ముగింపు: పీఠానికే భూమి.. జలమండలి కేటాయింపులు రద్దు!

కోకాపేటలోని శారదా పీఠం భూములను స్వాధీనం చేసుకునే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి, గతంలో పీఠానికి కేటాయించిన రెండు ఎకరాల భూమిని యథాతథంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.

కోకాపేటలో ఎత్తైన ప్రాంతం కావడం వల్ల, అక్కడి నుండి గ్రావిటీ ద్వారా పాతబస్తీ, మెహిదీపట్నం వంటి ప్రాంతాలకు నీటి సరఫరా చేయవచ్చని జలమండలి అధికారులు భావించారు. దీని కోసం పీఠం భూములను కోరడంతో వివాదం మొదలైంది, బీఆర్ఎస్ హయాంలో కేటాయించిన ఈ భూములను ప్రభుత్వం లాక్కోవాలని చూస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ,ఇది కేవలం సాంకేతిక కారణాలతో జరిగిన ప్రతిపాదనే తప్ప, ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం లేదని తెలిపింది.ఈ భూముల విషయంలో సరైన వివరాలు అందజేయకుండా వివాదానికి కారణమైన అధికారులను ముఖ్యమంత్రి నిలదీశారు. జలమండలికి అదనంగా ఇచ్చిన భూ కేటాయింపులను రద్దు చేయాలని ఆదేశించారు.

2019లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం వేద పాఠశాల, రాజశ్యామల అమ్మవారి ఆలయ నిర్మాణం కోసం ఎకరా కేవలం ఒక్క రూపాయి ధరకే రెండు ఎకరాల భూమిని శారదా పీఠానికి కేటాయించింది. ప్రస్తుతం అక్కడ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం లేకుండా పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version