Business
వీక్ పాస్వర్డ్ వల్ల 700 ఉద్యోగాలు పోయాయి
నార్తాంప్టన్‌షైర్‌కు చెందిన 158 ఏళ్ల చరిత్ర కలిగిన కెఎన్‌పీ లాజిస్టిక్స్ కంపెనీ ఒక్క ఉద్యోగి బలహీనమైన పాస్వర్డ్ కారణంగా దివాలా తీసింది. అకిరా అనే రాన్సమ్వేర్ గ్యాంగ్ హ్యాకర్లు ఈ బలహీనమైన పాస్‌వర్డ్‌ను ఉపయోగించి కంపెనీ ఐటీ సిస్టమ్‌లోకి చొరబడి, కీలకమైన డేటాను ఎన్‌క్రిప్ట్ చేశారు. దీంతో కంపెనీ ఆపరేషన్స్ పూర్తిగా స్తంభించాయి. హ్యాకర్లు కంపెనీ నుంచి £5 మిలియన్ల (సుమారు రూ. 58 కోట్లు) రాన్సమ్ డిమాండ్ చేశారు, కానీ కంపెనీ ఈ మొత్తాన్ని చెల్లించలేకపోయింది. ఫలితంగా, 1865 నుంచి నడుస్తున్న ఈ సంస్థ రాత్రికి రాత్రే మూతపడి, 700 మంది ఉద్యోగులు తమ జీవనోపాధిని కోల్పోయారు.
కెఎన్‌పీ లాజిస్టిక్స్, నైట్స్ ఆఫ్ ఓల్డ్ బ్రాండ్ కింద 500 లారీలను నడుపుతూ, యూకేలో లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన స్థానం కలిగి ఉంది. కంపెనీ ఇండస్ట్రీ ఐటీ స్టాండర్డ్స్‌ను పాటించడంతో పాటు సైబర్ దాడులకు వ్యతిరేకంగా £1 మిలియన్ ఇన్సూరెన్స్ కూడా కలిగి ఉంది. అయినప్పటికీ, ఒక ఉద్యోగి ఉపయోగించిన సాధారణ పాస్వర్డ్ హ్యాకర్లకు తలుపులు తెరిచింది. ఈ ఘటన బలమైన పాస్వర్డ్లు, మల్టీ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (ఎంఎఫ్ఏ) వంటి ఆధునిక సైబర్ సెక్యూరిటీ పద్ధతుల ఆవశ్యకతను గుర్తు చేస్తుంది. కంపెనీ డైరెక్టర్ పాల్ అబాట్ ఈ ఘటన గురించి ఆ ఉద్యోగికి చెప్పలేదని, ఆ మానసిక భారం వారిపై వేయడం సరికాదని బీబీసీకి తెలిపారు.