Andhra Pradesh

విజయవాడ దుర్గమ్మ ఆలయంలో హెయిర్‌ వేలం హవా.. తలనీలాల ద్వారా కోట్లలో ఆదాయం నమోదు

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గమ్మ ఆలయంలో జరిగిన తలనీలాల వేలం రికార్డు స్థాయిలో ఆదాయాన్ని తెచ్చింది. భక్తులు సమర్పించిన తలనీలాలను సేకరించడానికి నిర్వహించిన ఈ వేలం ద్వారా ఆలయానికి రూ.10.10 కోట్లు వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్ ఈ హక్కులను సొంతం చేసుకుంది. గతంతో పోలిస్తే, ఈసారి ఆదాయం దాదాపు రెట్టింపు అయింది.

రెండేళ్ల క్రితం జరిగిన తలనీలాల వేలంలో ఆలయానికి కేవలం రూ.5.67 కోట్లు మాత్రమే వచ్చాయి. అయితే, ప్రస్తుతం 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.10.10 కోట్లు లభించాయి. తదుపరి 2027–28 ఆర్థిక సంవత్సరానికి 10 శాతం అదనంగా రూ.11.11 కోట్లకు టెండర్ ఖరారైంది. దీని ద్వారా దుర్గగుడి ఆదాయ వనరులు గణనీయంగా పెరిగాయి.

ఈ తలనీలాల వేలానికి బహిరంగ వేలం, సీల్డ్ టెండర్ విధానాల్లో టెండర్లను ఆహ్వానించారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 19 మంది కాంట్రాక్టర్లు టెండర్లు సమర్పించారు. వీరిలో నలుగురు సీల్డ్ టెండర్లు సమర్పించగా, బహిరంగ వేలంలో అతి అత్యధిక ధర పలకడంతో ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్‌కు కాంట్రాక్ట్ సంపాదించారు. ఈ వేలం దుర్గగుడిలోని మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో జరిగింది.

దుర్గమ్మ ఆలయానికి భక్తులు సమర్పించే తలనీలాలకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ఈ వేలాలు ఆలయానికి ప్రధాన ఆదాయ వనరులుగా మారాయి. ఈసారి కాంట్రాక్టు భారీ మొత్తంలో రావడంతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు మరింత నిధులు అందుబాటులోకి రానున్నాయి.

ఇదిలా ఉండగా, త్రిపుర హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ టి. అమర్‌నాథ్ గౌడ్ కుటుంబంతో కలిసి విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిలో కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వాములను ప్రత్యేకంగా పూజించారు. ఆలయానికి వచ్చిన జస్టిస్ అమర్‌నాథ్ గౌడ్ దంపతులకు దుర్గమ్మ ఆలయ ధర్మక్తల మండలి ఛైర్మన్ బోర్రా రాధాకృష్ణ (గాంధీ) ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం, స్వామి అమ్మవార్ల శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు, చిత్రపటము ఆయనకు బహుమతిగా ఇచ్చారు. వేద పండితులు ఆశీర్వచనాలిచ్చారు.

#DurgaTemple#HairAuction#TempleIncome#IndianHairIndustries#Indrakeeladri#KanakaDurga#TempleDevelopment
#DevoteeOfferings#JusticeAmarnathGoud#SpiritualVijayawada

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version