Andhra Pradesh
విజయవాడలో ‘ఆవకాయ అమరావతి’ వేడుకలు.. మూడు రోజుల కార్యక్రమాల పూర్తి షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆవకాయ అమరావతి ఉత్సవాలు విజయవాడ నగరాన్ని మూడు రోజుల పాటు కళా సాంస్కృతిక వైభవంతో ముస్తాబు చేస్తాయి. జనవరి 8 నుండి 10 వరకు భవానీ ద్వీపం మరియు పున్నమి ఘాట్ వేదికలుగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఏర్పాట్లు ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి. విజయవాడ కళాభిమానులకు పండగ వాతావరణం నెలకొంది.
రాష్ట్ర పర్యాటక శాఖ మరియు టీమ్‌వర్క్ ఆర్ట్స్ కలిసి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ ఉత్సవంలో నృత్యం, సంగీతం, సినిమా, సాహిత్యం, కవిత్వం వంటి అనేక రకాల కళలు ఒకే వేదికపై ప్రదర్శించబడతాయి. ఈ ఉత్సవానికి ప్రవేశం ఉచితం. ప్రత్యక్షంగా హాజరు కాలేని వారు అధికారిక వెబ్సైట్లో నమోదు చేసుకుని ఆన్లైన్లో కూడా వీక్షించవచ్చు.
గురువారం (జనవరి 8) సాయంత్రం పున్నమి ఘాట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా తోలు బొమ్మల ఊరేగింపు, తీన్మార్ డప్పుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకోనున్నాయి. అనంతరం జామర్స్ సంగీతం, పున్నమి ఘాట్ హారతి, హౌస్‌బోటు ప్రారంభోత్సవం, శంఖం–నగారా–డ్రమ్స్ ప్రదర్శనలతో తొలి రోజు కళా వైభవంగా ముగియనుంది.
శుక్రవారం, జనవరి 9న భవానీ ద్వీపంలో సినీప్రపంచం గురించి చర్చలు జరుగుతాయి. యండమూరి వీరేంద్రనాథ్, ఎస్.హుస్సేన్ జైదీ, సుధీర్ మిశ్రలు సినిమాల్లో విలన్ పాత్రల ప్రాధాన్యత గురించి మాట్లాడతారు. భారతీయ పురాణాలు, ఆధునిక ఆలోచనలు, ఓటీటీ ప్రభావం గురించి మేధావులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు.
అదే రోజు సాయంత్రం, పున్నమి ఘాట్‌లో కర్ణాటక సంగీత ప్రదర్శనలు, కూచిపూడి నృత్యనాటకం, సంగీతం-కవిత్వంపై చర్చలు జరుగుతాయి. అనిరుద్ వర్మ కలెక్టివ్, నిజామీ బంధు సంగీత ప్రదర్శనలు కూడా అలరిస్తాయి.
శనివారం, జనవరి 10, భవానీ ద్వీపంలో తెలుగు కథన కళ, సినిమా-జర్నలిజం, తెలుగు సాహిత్యం-సినిమా అనుబంధం, అనువాద కళపై ప్రత్యేక చర్చలు జరగనున్నాయి. సాయంత్రం, పున్నమి ఘాట్‌లో, ప్రముఖ బ్యాండ్ చౌరస్తా సంగీత ప్రదర్శనతో పాటు, ఎన్టీఆర్ నటనా విశ్వరూపానికి నివాళి, ప్రేమ కథ సంగీత నాటకం, జావేద్ ఆలీ సంగీత కచేరి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి.
సాంస్కృతిక వారసత్వాన్ని, ఆధునిక కళారూపాలను ఒకే వేదికపై ఆవిష్కరిస్తూ ఆవకాయ అమరావతి ఉత్సవాలు విజయవాడకు ప్రత్యేక గుర్తింపును తీసుకురానున్నాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
#AmaravatiAavakaaya#VijayawadaEvents#APCulture#BhavaniIsland#PunnamiGhat#APTourism#MusicFestival
#DanceFestival#CinemaAndLiterature#FreeEntry#CulturalFestival
![]()
