Andhra Pradesh
వార్షిక ఆదాయం రూ.4.59 లక్షలే… కానీ ఛార్టర్డ్ ఫ్లైట్స్‌లో తిరుగుదల?
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి నిందితుడిగా ఉన్న A-34 వెంకటేశ్ నాయుడు జీవనశైలి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఆయన లగ్జరీ లైఫ్‌కు సంబంధించిన వీడియోలు విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.
గత ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి డమ్మీ అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటేశ్ నాయుడు తన అఫిడవిట్‌లో వార్షిక ఆదాయం కేవలం రూ.4.59 లక్షలుగా పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న వీడియోల ప్రకారం, ఆయన ఛార్టర్డ్ ఫ్లైట్లలో ప్రయాణాలు, విలాసవంతమైన కార్లు, పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు, రాజకీయ ప్రముఖులతో కలిసి దిగిన ఫోటోలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
ఇతని ఆదాయం తక్కువగా ఉండగా ఇలా లగ్జరీ లైఫ్ ఎలా సాధ్యమైంది? ఛార్టర్డ్ ఫ్లైట్ ప్రయాణాలు ఎక్కడినుంచి వస్తున్నాయి? ఎవరి సహకారంతో ఇంత అంతస్తుకు చేరాడు? అనే ప్రశ్నలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చకు లోనవుతున్నాయి.