News
రైతులపై దాడి అమానుషం: హరీశ్ రావు
గద్వాల జిల్లాలోని పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం రైతుల భూములను కబ్జా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ క్రమంలో రైతులపై దాడులు చేయడం అమానుషమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ బౌన్సర్లు, పోలీసులు కలిసి రైతులపై విచక్షణారహితంగా దాడి చేశారని, 12 గ్రామాల రైతులను కొట్టి, 40 మందిపై అకారణంగా కేసులు నమోదు చేసి, 12 మందిని రిమాండ్కు పంపినట్లు ఆయన ఆరోపించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, రైతులను కాపాడాల్సిన ప్రభుత్వం వారిపైనే దాడులు చేయడం సిగ్గుచేటని హరీశ్ రావు అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రైతుల కడుపు కొట్టి, వారి భూములను పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం అలవాటుగా మారిందని హరీశ్ రావు విమర్శించారు. ఈ దాడులకు బాధ్యులైన వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల హక్కుల కోసం బీఆర్ఎస్ ఎల్లప్పుడూ పోరాడుతుందని, ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని, ప్రభుత్వ తీరును ప్రజల ముందు బహిర్గతం చేస్తామని ఆయన హెచ్చరించారు.