Devotional
రూ.6.66 కోట్లతో అమ్మవారి ముస్తాబు

రూ.6.66 కోట్లతో అమ్మవారి ముస్తాబు
రాష్ట్రవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఏ మండపం చూసినా వివిధ రకాలుగా అమ్మవార్లను అలంకరిస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి
దేవాలయంలో అక్షరాలా రూ.6 కోట్ల 66 లక్షల 66 వేల 666 రూపాయలతో అలంకరించారు.
దసరా ఉత్సవాల ప్రారంభం నుంచి అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తుండగా, ఆదివారం మహాలక్ష్మీ అలంకరణ రూపంలో భక్తలకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రం నుంచి ప్రత్యేక వ్యక్తులను రప్పించి రూ.50 నుంచి మొదలుకొని రూ.500 నూతన కరెన్సీ నోట్లతో వివిధ రూపాల్లో మలిచి గర్భాలయంతో పాటు దేవాలయంలో అలంకరించారు. దీంతో అమ్మవారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిరాగా, కన్యకాపరమేశ్వరి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తుల నుంచి సేకరించిన నగదును అలంకరణకు ఉపయోగించగా, కరెన్సీని తిరిగి
వారికి అందించనున్నారు. ఈ సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం సాయంకాలం మహాలక్ష్మీ పూజలు నిర్వహించిన అనంతరం, దర్శనం కోసం వచ్చిన భక్తులకు అమ్మవారి డాలర్లను ఉచితంగా అందజేస్తున్నారు.
అష్టాదశ శక్తిపీఠాలు ఒకేచోట : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరాలయంలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్యర్యంలో దేవీ నవరాత్రులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా భారీ సెట్ వేశారు. భక్తులకు కనువిందు కలిగేందుకు మంచి ప్లాన్ వేశారు. దేశంలోని అన్ని శక్తి పీఠాల అమ్మవార్ల రూపాలను ఒకే దగ్గర ఏర్పాటు చేసి భక్తులకు వాటి దర్శనం కల్పిస్తున్నారు. ఇలా దేవతలందరూ ఒకే చోట దర్శనం ఇవ్వడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భక్తి శ్రద్ధలతో శక్తి పీఠాలను దర్శించుకుని మొక్కులు
తీర్చుకుంటున్నారు. నవరాత్రుల పూజలు పూర్తయ్యే వరకు శక్తి పీఠాల దర్శనం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.