Andhra Pradesh
రిషికొండ ప్యాలెస్‌లో పవన్ కళ్యాణ్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం విశాఖపట్నంలోని రిషికొండలో పర్యటించారు. గత ప్రభుత్వం నిర్మించిన ప్యాలెస్‌లు, ప్రాజెక్టుల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మొత్తం ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించి, అక్కడి పనుల నాణ్యత, వినియోగంపై అధికారులు ఇచ్చిన వివరాలు తెలుసుకున్నారు.
పవన్ కళ్యాణ్‌కు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం, రిషికొండ ప్రాజెక్టు ద్వారా ఏటా సుమారు రూ.7 కోట్ల ఆదాయం వస్తోందని, కానీ నిర్వహణ ఖర్చులు ఎక్కువవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా విద్యుత్ బిల్లులకే సంవత్సరానికి దాదాపు రూ.కోటికి పైగా వెచ్చించాల్సి వస్తోందని, ఈ వ్యయం కారణంగా ఆర్థిక లాభాలు తగ్గిపోతున్నాయని వివరించారు.
ఈ ప్రాజెక్టుపై ఖర్చు, మెయింటెనెన్స్‌పై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చేలా రిషికొండను అభివృద్ధి చేయాలని, ప్రజా డబ్బు వృథా కాకుండా కచ్చితమైన పథకం ప్రకారం ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. తన పర్యటనలో గుర్తించిన విషయాలను ముఖ్యమంత్రికి నివేదిస్తానని ఆయన తెలిపారు.