Andhra Pradesh
రాష్ట్రంలో న్యాయం, ధర్మం లేవు: జగన్
ఆంధ్రప్రదేశ్‌లో న్యాయం, ధర్మం గల్లంతయ్యాయని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజల పట్ల అన్యాయం జరుగుతోందని, చిన్న ప్రశ్నలు అడిగిన వారిని కూడా జైళ్లలో వేస్తున్నారని ఆయన ఆరోపించారు. న్యాయ వ్యవస్థపై తన నమ్మకాన్ని పునరుద్ఘాటించిన ఆయన, ప్రజల హక్కుల కోసం పోరాటం అవసరమని వ్యాఖ్యానించారు.
మంగళవారం విజయవాడలో వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “తప్పుడు కేసుల్లో ఇరుక్కొన్న బాధితులకు అండగా లాయర్లు నిలవాలి. అబద్ధపు ఆరోపణలతో సతమతమవుతున్న వారి పక్షాన మీరు న్యాయ పోరాటం చేయాలి” అని సూచించారు. పార్టీ తరఫున లీగల్ సెల్ నాయకుల సేవలు మర్చిపోనని స్పష్టం చేశారు.
“అడగనిదే అమ్మ పెట్టదు, కోరనిది దేవుడు వరమివ్వడు, అలాగే లాయర్లు వాదించనిదే న్యాయం దక్కదు” అంటూ చక్కని ఉపమానంతో తన సందేశాన్ని ప్రజల్లోకి చొప్పించారు జగన్. న్యాయ పోరాటంలో లీగల్ సెల్ కీలక పాత్ర పోషించాలని కోరిన ఆయన, ప్రజాస్వామ్యంలో ఇది ఒక ప్రధానమైన ఆర్మ్‌గా ఉండాలని హితవు పలికారు.