Andhra Pradesh
రాయలసీమలో భారీ వర్షాలు: రైతుల్లో ఆశలు చిగురించాయి
ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ ప్రాంతాన్ని భారీ వర్షాలు తాకాయి. కర్నూలు, అనంతపురం, సత్య సాయి జిల్లాల్లో రాత్రి నుంచి బారీ వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల వరుసగా గంటల పాటు వాన పడుతూ ఉండటంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లా ఆదోనిలో కుండపోత వర్షం కురవడంతో నది ఒడ్డు ప్రాంతాల్లో వరద ఉధృతి పెరిగింది.
ఇక ఆదోనిలోని ఓ కొండపై ఉన్న ఆలయం మెట్లపై నుంచి వర్షపు నీరు జలపాతంలా దూకుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆలయం ప్రాంతం చుట్టూ నీరు చేరిపోవడంతో భక్తులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు అప్రమత్తమై సమీప గ్రామాలకు హెచ్చరికలు జారీ చేశారు.
తీవ్ర వర్షాభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాయలసీమ రైతులకు ఈ వానలు కొంత ఊరట ఇచ్చాయి. పొలాల్లో విత్తనాలు నాటే పరిస్థితి ఏర్పడిందని స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలంగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న వ్యవసాయ కార్మికులకు ఇది ఓ శుభసూచకంగా భావిస్తున్నారు.